Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామానికి అనుదీప్ గుంపుగా నామకరణం
- సంతోషం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలోని సుబ్బారావుపేట గ్రామ పంచాయతీలో గల మద్యగుంపు గ్రామంలో 40 గిరిజన కుటుంబాలు నివసించుచున్నారు. వీరి ఇండ్ల నుండి ప్రధాన రహదారికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం లేనందున 60 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్య గుంపు ప్రజలు బయటకు వెళ్ళాలి అన్న పొలం గట్ల వెంబడి వెళ్ళవలసి వస్తుందని, దీనితో పాఠశాలకు వెళ్ళే చిన్న పిల్లలు, అనారోగ్య పరిస్థితులలో వున్నా వృద్ధులు, గర్బిణీలు వెళ్ళడానికి రోడ్డు లేక నిత్యం అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో తీవ్రమైన సమస్య వుంటుంది. ఎవరైనా వ్యక్తి మరణించినప్పుడు బయటకు తీసుకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తే పొలం గట్ల మీద నుండి వెళ్ళవలసి వచ్చేది. పొలం రైతులు తన పొలం చెడిపోతుందని నానా దుర్భాషలాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ విషయమై గ్రామస్తులు ప్రజావాణిలో కలెక్టర్ దురిశెట్టి అనుదీప్‌కు 27.02.2023 రోజున ఫిర్యాదు చేశారు. తదుపరి ప్రజా ప్రతినిధులు మండల స్థాయి అధికారులు అనేక మార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి గత 60 ఏండ్ల రోడ్డు సమస్యకు పరిష్కార మార్గం చూపించారు. గ్రామానికి చెందిన పాయం కన్నయ్యకు చెందిన వ్యవసాయ పట్టా భూమి నుండి 8 ఫీట్లు వెడల్పుతో 200 మీటర్ల పొడవు రోడ్డు నిర్మాణానికి నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పై దాన పత్రము గ్రామ పెద్దల సమక్షములో రాసి ఇచ్చారు. దీంతో గ్రామపంచాయతీ నిధులతో రహదారి పనులు ప్రారంభించారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో తమ గ్రామానికి రహదారికి మోక్షం కలిగిందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు గ్రామానికి అనుదీప్ గ్రామంగా నామకరణం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పీటసీ తెల్లం సీతమ్మ ఎంపీడీవో ఎం.చంద్రమౌళి, ఎంపీఓ ముత్యాలరావు, సుబ్బారావు పేట, నడికుడి సర్పంచులు చిన్నారావు, తెల్లం రామకృష్ణ, ఎంపీటీసీ తిరుపతిరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.