Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనువాదాన్ని చొప్పించే కుట్ర
- కుల వ్యవస్థ వివిధ రూపాల్లో ముందుకు..
- సందిగ్ధంలో రాజ్యాంగ విలువల రక్షణ
- సమానత్వ భావన హరింపు: ప్రొ. జి. హరగోపాల్
- సంపద కేంద్రీకృతం: ఆర్తిక విశ్లేషకులు పాపారావు
- ప్రత్యామ్నాయ పౌర సమూహం (సీసీఏ) ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సదస్సు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు తిలోదకాలు ఇచ్చి దేశంలో ప్రత్యామ్నాయ రాజ్యాంగ ఏర్పాటుకు ఎన్డీఏ ప్రభుత్వం యత్నిస్తోందని ప్రొఫెసర్ జి. హరగోపాల్ తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చి మనువాదాన్ని ముందుకు తెచ్చే కుట్ర జరుగుతోందని చెప్పారు. ప్రతీకార విప్లవంలో భాగంగా రాజ్యాంగ సంస్థలు విలువల విధ్వంసం ముందుకు వస్తోందన్నారు. ప్రత్యామ్నాయ పౌర సమూహం (సీసీఏ) ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సదస్సులో ' రాజ్యాంగ సంస్థల విధ్వంసం' పై హరగోపాల్ మాట్లాడారు. దేశానికి నిజమైన స్వాతంత్య్రం రావాలంటే కుల వ్యవస్థ పోవాలని అంబేద్కర్ ఆశిస్తే... దేశంలోని ఆధిపత్య శక్తులు కుల వ్యవస్థను వివిధ రూపాల్లో చొప్పించేందుకు యత్నిస్తున్నాయన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు ప్రజాస్వామ్యం రాజ్యాంగ పరిరక్షణకు అవసరమని పేర్కొన్నారు. అటువంటి సంస్థలను మోడీ ప్రభుత్వం తమ చెప్పు చేతల్లో ఉంచుకునేందుకు పూనుకుందన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతత్వానికి వ్యతిరేకంగా కేంద్ర సర్కారు విధానం ఉందన్నారు. న్యాయవ్యవస్థ రాజ్యాంగం, రాజ్యాంగ విలువలను కాపాడటంలో సందిగ్ధంలో పడితే దేశం భవిష్యత్తు ఏంటి అని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే భావజాలం ఉన్నవాళ్లను విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టి విజ్ఞాన సంస్థలను సైతం నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందన్నారు. అంబేద్కర్ ఉన్నత విలువలను నిలపడం కోసం కషి చేయాలని పిలుపునిచ్చారు. సీసీఏ వంటి సంస్థలు మరెన్నో ఆవిర్భవించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సంపద అందరికీ ప్రయోజనం చేకూర్చాలి, అసమానతలను రూపుమాపాలని అంబేద్కర్ ఆశిస్తే బిజెపి ప్రభుత్వ విధానం అందుకు విరుద్ధంగా సాగుతుందని ఆర్థిక విశ్లేషకులు పాపారావు అన్నారు. ' ప్రభుత్వ ఆర్థిక విధానాలు - ప్రజా సంపద లూటీ' అనే అంశంపై ఆయన ప్రసంగించారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్ పీజీ) విధానాలు బిజెపి భావజాలానికి లింకు బాగా కుదిరిందని పాపారావు చెప్పుకొచ్చారు. సంక్షేమ రాజ్యాన్ని పీకేసి దాని స్థానంలో ఎల్పిజి విధానాన్ని ముందుకు తీసుకొచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం దష్టిసారించిందని తెలిపారు. దానిలో భాగంగానే కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించారని, నగదు రద్దు, జీఎస్టీ లను ముందుకు తీసుకొచ్చారని వివరించారు. జీఎస్టీ తో చిన్న వ్యాపారులు చితికిపోయారని తెలిపారు. డాక్టర్ రెహనా బేగం సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో సామాజికవేత్త వనమాలి, సీసీఏ సభ్యులు డాక్టర్లు ఎంఎఫ్ గోపీనాథ్, యలమంచిలి రవీంద్రనాథ్, రవిమారుత్, స్పర్శ భాస్కర్, ఐవీ రమణారావు, డాక్టర్ల్ భారవి, మువ్వా శ్రీనివాసరావు, బండారు రమేష్ తదితరులు పాల్గొన్నారు.