Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన నేతలు
నవతెలంగాణ-భద్రాచలం
దేశాన్ని పాలిస్తున్న మనువాదుల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని ప్రతి పౌరుడు ప్రతిన పూనాలని సీపీఐ(ఎం) భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బి నర్సారెడ్డిలు పిలుపునిచ్చారు. పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కుల రహిత సమాజం కోసం కృషి చేశారని, సమాజంలో అంటరానితనం, అస్పృశ్యత మొదలగు దురాచారాలకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడారని అన్నారు. సామాజిక న్యాయం లక్ష్యంగానే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని అది నేడు ప్రమాదంలోకి నెట్టబడుతుందని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం ధ్వంసం చేయబడుతుందని, సామాజిక న్యాయమును చిన్నాభిన్నం చేసి కుల వ్యవస్థను పెంచి పోషించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తీసుకువచ్చేదానికి పూనుకుంటున్నారని దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు, ప్రజాస్వామ్యవాదులు పోరాడాలని అన్నారు. అంటరానితనం వివక్షత దోపిడీ లేని నూతన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, సున్నం గంగా, పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, వై.వెంకట రామారావు, సీనియర్ నాయకులు బి.బి.జి.తిలక్, పట్టణ కమిటీ సభ్యులు కుంజా శ్రీనివాస్, కోరాడ శ్రీనివాస్, మందా రమణయ్య, మాజీ ఎంపీటీసీ చేగొండి శ్రీనివాస్, గిరిజన సంఘం నాయకులు జోగారావు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.