Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెలాఖరు వరకు సాగర్ నీటిని అందించండి
- కొనుగోలు కేంద్రాలన్నీ ప్రారంభించాలి
- పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వండి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-సత్తుపల్లి
రైతుల పంటల సాగు ఈ యేడాది కొద్దిగా ఆలస్యమైన నేపధ్యంలో ఈనెలాఖరు వరకు సాగర్ నీటిని అందించి వేసిన పంటలు చేతికందేలా చూడాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు నీటిపారుదలశాఖ అధికారులను కోరారు. గురువారం సత్తుపల్లిలోని ప్రజా సంఘాల కార్యాలయంలో నున్నా విలేకర్లతో మాట్లాడారు. అకాల వర్షాలు, ఈదురు గాలులకు పంటనష్టం జరిగిన రైతులకు ఎకరానికి రూ. 10వేలు చొప్పున నష్ట పరిహారం అందిస్తామని ఇటీవల పంటనష్ట పరిశీలనకు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని నాగేశ్వరరావు కోరారు. ఇందుకోసం సంబంధిత వ్యవసాయ, ఉద్యాన శాఖలు తక్షణమే జరిగిన పంటనష్ట వివరాలను ప్రభుత్వానికి నివేదిక అందించాల న్నారు. కేవలం మొక్కజొన్న, వరి, ఇతర పంటలకు పరిహారం అందిస్తున్న మాదిరిగానే మామిడి పంటకు కూడా పరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. వరి కోతలు ముమ్మురమైన నేపధ్యంలో ధాన్యం దళారుల పాలుకాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలన్ని త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. సాగులో ఉన్న పోడు భూములకు హక్కు పత్రాల జారీ ప్రక్రియను తక్షణమే చేపట్టాలన్నారు. బుగ్గపాడు ఫుడ్‌పార్కు పనులను పూర్తిచేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు మాచర్ల భారతి, జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, జాజిరి శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి రావుల రాజబాబు, సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు పాల్గొన్నారు.