Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్థంతి సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-పాల్వంచ
బరపటి సీతారాములు 15వ వర్థంతి కార్యక్రమం సీపీఐ(ఎం) పాల్వంచ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్బంగా సత్యవాణి అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, కాసాని ఐలయ్య మాట్లాడుతూ కొత్తగూడెం ప్రాంత పార్టీ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ధన్యజీవి కామ్రేడ్ బరపటి అని ముఖ్యంగా భూ పోరాటాల్లో ముందుండే వారని, ఇండ్ల స్థలాల పోరాటమైన, పోడు పోరాటమైన ఫలితం వచ్చేవరకు దృఢ దీక్షతో ఉండేవారన్నారు. తునికాకు రేట్లు ఇప్పించడంలో, బోనస్ విషయంలో రాజీ లేకుండా పోరాడేవారని వారన్నారు. ఇప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతూ పాలన చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం 2022 వరకు ఇల్లు లేని పేద లేకుండా చేస్తామని ప్రగల్బాలు పలికారని 9 సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు ఇవ్వలేదని, రెండుకోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అని జుమ్లా మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఉన్న ప్రభుత్వరంగాన్ని ప్రయివేట్ వారికి కట్టబెడుతూ ఉద్యోగులను బలవంతపు పదవీ విరమణ చేపిస్తున్నారని, కోవిడ్ కాలంలో 6.50 లక్షల చిన్న పరిశ్రమలు మూతబడి కోట్లమంది ఉపాధి కోల్పోయారన్నారు. వారిని ఆదుకోవాల్సిన కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నారు. అదే సమయంలో కార్పొరేట్ల ఆస్తులు వేల కోట్లనుండి లక్షల కోట్లకు పెరిగాయని, ఫార్మా కంపినీలు, కార్పొరేట్ హాస్పిటళ్లు వేలకోట్ల ప్రజాధనం కొల్ల గొట్టాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాలమధ్య మతపరమైన వైషమ్యాలు రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకొనే నీచమైన విధానాన్ని అవలంబిస్తున్నదని వీటిని తిప్పి కొట్టడమే బరపటికి ఇచ్చే నిజమైన నివాళి అని వారు అన్నారు.
అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, బుర్రి ప్రాసాద్ మాట్లాడుతూ అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అని రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదలందరికీ డబల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని, స్థలం ఉన్నవారికి 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకొనే సౌకర్యం కల్పిస్తామని మాయా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, కానీ రాష్ట్ర వ్యాపితంగా 20 లక్షల కుటుంబాలు ఇళ్లు లేనివాళ్ళు ఉంటే ఇప్పటికి రెందులక్షల ఇళ్లు కూడా కట్టలేదని, అదేవిధంగా 3 ఎకరాల భూ పంపిణీ, దళితబందు, పోడు పట్టాలు అన్ని ఆటకెక్కాయని మళ్ళీ సెంటిమెంటుతో అధికారంలోకి రావాలనే ఆరాటంతో ఉన్నారని వారు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సాంబశివరావు, జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా రవికుమార్, అన్నవరపు సత్యనారాయణ, రేపాకుల శ్రీను, పట్టణ కమిటీ సభ్యులు రహీం తులసిరాం, కాంతి, రాములు, గౌసియా బేగం, మాధవి, గుర్రం రాములు, స్వరూప, తదితరులు పాల్గొన్నారు.