Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదోన్నతులు, బదిలీలు నిర్వహించాలి
- పిఆర్సీ ప్రకటించాలి
- పెండింగ్ డీఏలను విడుదల చేయాలి
- నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి
- టీఎస్ యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు నిర్వహించాలి, పీఆర్సీ ప్రకటించాలి, పెండింగ్ లో ఉన్న మూడు డీఏలను విడుదల చేయాలి, ఉద్యోగుల సామాజిక భద్రతకు ముప్పుగా ఉన్న నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలి' అని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవాని, జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక యూటీఎఫ్ భవన్లో యూనియన్ జిల్లా అధ్యక్షుడు జీ.వి.నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. నూతన పెన్షన్ విధానం ( సీపీఎస్) పట్ల దేశవ్యాప్తంగా ఉద్యోగులలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్ ను రద్దు చేశాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో సీపీఎస్ ను రద్దు చేసి దేశవ్యాప్తంగా సీపీఎస్ వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో పాఠశాల విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అర్హతగలిగిన ఉపాధ్యాయులు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు. నిరంతరం పోరాటాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా మీనమేషాలు లెక్కించడం ఎందుకో అర్థం కావడం లేదని విమర్శించారు. బదిలీలు, పదోన్నతులు వేసవి సెలవులలో పూర్తి చేయాలని , పెండింగ్ లో ఉన్న మూడు డిఎ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు బుర్రి వెంకన్న, షమీ, వల్లంకొండ. రాంబాబు, షేక్ రంజాన్, నరసయ్య, సురేష్, సతీష్, రమేష్ ,గీత, సుధాకర్, నాగేశ్వరరావు, వలీ, రామారావు, నిర్మలాకుమారి, ఉద్దండు, శ్రీకాంత్, లక్ష్మీకుమారి, రోజా తదితరులు పాల్గొన్నారు.