Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్రమత్తంగా వ్యవహరించిన ఎమ్మెల్సీ మధు
- పరిహారం ప్రకటనతో తగ్గిన నిరసనజ్వాలలు
బాధితులకు పరిహారం పంపిణి ఏర్పాట్లు
నవతెలంగాణ-కారేపల్లి
చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా పేల్చిన బాణాసంచా పడి పూరిగుడిసే దగ్ధం దానిలోని గ్యాస్ బండ పేలి నలుగురు మృత్యవాత, 9 మంది తీవ్రగాయాలైన ఘటన రాజకీయ పార్టీలకు గుణపాఠం అని చెప్పక తప్పదు. నేతల బర్త్‌డేలు, విజయభేరీలు, నేతలు వచ్చినా, పోయినా టప్పాసులు మోగందే కార్యక్రమం సంపూర్ణ కాదనే నమ్మకం రాజకీయ పార్టీ కార్యకర్తలలో బలంగా నాటుకుంది. నేతల కండ్లలో పడాలంటే మోత మోగించాల్సిందే అన్న సంప్రదాయం సాగుతుంది. చీమలపాడులో ఘటనలో కూడా అదే జరిగింది. అసలే ఎంపీపీ మాలోత్ శకుంతల స్వంత ఊరు... వచ్చింది ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ఆ మాత్రం హంగామా చేయకుంటే చులకనై పోతామేమోనని అపోహతో శక్తి మేరకు సభకు జన సమీకరణ చేయటం దానికి అనుగుణంగా బాణా సంచా వంటి హంగులు నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అనుకున్నది ఒకటైతే అయినది మరోకటి అనే రీతిలో అత్మీయ సమ్మేళనం విషాదం నింపింది.
బోరుమంటున్న బాధిత కుటుంబాలు
చీమలపాడు ఆత్మీయ సమ్మేళనంకు కార్యకర్తలతో పాటు, మధ్యాహ్నంతో కూలీ పనులు ముగిసిశాయి కదా చూచివద్దామని కొందరు, కూలిచ్చి తీసుకవచ్చిన వారు కొందరు హాజరైనారు. సజావుగా సాగితే అందరు సంతృప్తిగా విందు ఆరగించి పోయేవారు. అనుకోని ఘటన బాణసంచా రూపంలో వచ్చి 13 కుటంబాలలో చిచ్చురేపింది. బాధిత కుటుంబాలన్ని రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలే. ఆకుటుంబాలను కదిలిస్తే బోరుమంటున్నాయి.
స్టేషన్ చీమలపాడుకు చెందిన బానోత్ రమేష్, చీమలపాడుకు చెందిన అజ్మీర మంగు, గేటు రేలకాయలపల్లికి చెందిన ధర్మసోత్ లక్ష్మణ్, వలస కూలీ నికోడే సందీప్(38) కాలుతున్న గుడిసెను ఆర్పే క్రమంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కొల్పోయారు. అప్పటి వరకు మంటలను ఆర్పే పనిలో చురుకుగా ఉన్న సీఐ గన్‌మెన్ నవీన్, తవిసిబోడుకు చెందిన తేజావత్ బాస్కర్, వెంకిట్యాతండాకు చెందిన అంగోత్ కుమార్, కాళ్లు కోల్పోయి జీవచ్చావాల ఉన్నారు. నారాటి వెంకన్న, ఏ.శ్రీనివాసరావు, బండి రామారావు, తేళ్ళ శ్రీనివాసరావు, తేజావత్ రాంబాబు, అజ్మీర హరిబాబులు గాయాలతో చికిత్స పొందుతున్నారు.
సకాలంతో స్పందించిన ఎమ్మెల్సీ మధు
పేలుడు ఘటన తెలిసిన వెంటనే అప్రమత్తమైన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధు సకాలంలో స్పందించారు. క్షతగాత్రులకు మెరుగునై వైద్య సాయం అందేంచుకు ప్రభుత్వ అధికారులతో, ప్రభుత్వ పెద్దలతో నిత్యం సంప్రదింపులు జరుపుతునే ఉన్నారు. మృతి చెందిన కుటుంబాల పరిస్ధితి తెలుసుకోని చలించిన ఎమ్మెల్సీ మధు, సీఎంవో అధికారులకు క్షేత్రస్ధాయి తీవ్రతను వివరించి మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు పరిహారం అందేలా రాత్రికి రాత్రే ఉత్తర్వులు వచ్చేలా చేయగలిగారు. దీంతో పాటు తక్షణ సాయంగా బీఆర్ఎస్ తరుపును మృతులకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షలు ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ మృతులకు రూ.2 లక్షలు ఇవ్వటం, క్షతగాత్రులకు రూ.లక్ష, ఎంపీ నామా నాగేశ్వరరావు మృతులకు రూ.2 లక్షలు, క్షతగ్రాతులకు రూ.50వేలు ఇస్తామని ప్రకటించటంతో బాధితుల కుటుంబాలు, గ్రామస్తుల నుండి నిరసన జ్వాలాల నుండి బీఆర్ఎస్ బయటపడింది.
బాధితులకు పరిహారం పంపిణీ ఏర్పాట్లు
పేలుడు ఘటన నుంచి తేరుకుంటున్న చీమలపాడులో ప్రభుత్వం బాధితులకు ప్రకటించిన పరిహారంను త్వరితగతిన అందించే ఏర్పాట్లను ఎమ్మెల్సీ తాత మధు పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి పువ్వాడ అజరుకుమార్ చేతుల మీదిగా పరిహారం చెక్‌లను బాధిత కుటుంబాలను అందించి పనిలో నిమగమైనారు.