Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ మీడియా బాబురావు
నవతెలంగాణ భద్రాచలం రూరల్
రాష్ట్రవ్యాప్తంగా వీవోఏలు చేపట్టిన సమ్మె జయప్రదం కావాలని, వీవోఏల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎంపీ మీడియం బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఐకేపీ వీఓఏలు చేపట్టిన నిరవదిక సమ్మె శిబిరాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. గత 15 ఏండ్లుగా సంఘాలను ప్రారంభించి ఇంటి పనిని సైతం పక్కనపెట్టి, మహిళ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వీవోఏలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు అనేక స్వయం ఉపాధి పనులు, వ్యాపారాలు చేసుకోవడం కోసం ఆర్థిక స్వాలంబన కలగడం కోసం కృషి చేస్తూ నిరంతరం వారి అభివృద్ధికి పాటుపడుతూ ఎనలేని కృషి చేస్తున్న వీవోఏలను ప్రభుత్వం సర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన కోరారు. ఇతర ప్రైవేటు ప్రాజెక్టు అయినా శ్రీనిధి రంగాన్ని కూడా వివోఏలకు జత చేసి వారితో వెట్టు చాకిరీ చేపిస్తున్నారని దీనికి ప్రత్యేకంగా ఎటువంటి వేతనం ఇవ్వడం లేదని దీనికి అదనపు వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకుపోవడంలో వీరి పాత్ర కీలకమని అటువంటి వీరి పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని కనీస వేతనం రూ.26000 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వారి వ్యక్తిగత ఖాతాల్లో వేతనం వేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఐడీ కార్డులు మంజూరు చేయాలని, రూ.10 లక్షల సాధారణ ప్రమాద బీమా కల్పించాలని, సీనియర్లుగా ఉన్న వీవోఏలను సీసీలుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కరించే అంతవరకు పోరాటం కొనసాగించాలని మీకు సీఐటీయూ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ శ్రామిక మహిళా పట్టణ కన్వీనర్ మర్లపాటి రేణుక, గిరిజన సంఘం జిల్లా నాయకులు కారం పుల్లయ్య, టౌన్ కమిటీ సభ్యులు నగర కంటి నాగరాజు, ట్రాన్స్పోర్ట్ రంగం కార్యదర్శి జి.లక్ష్మీకాంత్, పి.సంతోష్, కార్పెంటర్ యూనియన్ కార్యదర్శి అప్పారి రాము, సెంట్రింగ్ యూనియన్ నాయకులు, రమేష్ వీవోఏల సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకటలక్ష్మి, చంద్రలీల, కోశాధికారి సీతారత్నం తదితరులు పాల్గొన్నారు.