Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఏసీ చైర్మెన్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్
- జేసీకి మెమోరండం అందజేత
- కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం : జేసీ
నవతెలంగాణ-పాల్వంచ
భూక్యా వెంకటేష్‌కి మెరుగైన వైద్యం అందించాలని, బాద్యుడైన సర్పంచ్ సురేందర్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికుల, ఉద్యోగుల సంఘం జయంతి యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన చేసి, కలక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నా సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్ మాళోత్ సతీష్ అధ్యక్షతన జరిగిన జేఏసీ చైర్మన్, గ్రామ పంచాయతీ కార్మికుల, ఉద్యోగుల సంఘం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జె.రమేష్ మాట్లాడారు. ఏప్రిల్ 13న టేకులపల్లి మండలంలో ముత్యాలంపాదు క్రాస్ రోడ్లో రైతు వేదికలో జరిగిన స్వచ్ఛ భారత్ మిషన్ ఎస్ఎంజి శిక్షణా కార్యక్రమం సందర్భంగా కరెంట్ సౌకర్యం లేకపోతే, ఆ పనికి సంబంధం లేని మల్టీ పర్పస్ వర్కర్ భూక్యా వెంకటేష్‌కి బాధ్యత ఇచ్చి కరెంట్ కోసం పోల్ ఎక్కమని సర్పంచ్ సురేందర్ ఆదేశాలు జారీ చేశారు. దీనితో వెంకటేష్ పోల్ ఎక్కగా కరెంట్ షాక్ తగిలి పోల్ పై నుండి కింది పడి ఒళ్లంతా కాలిపోయిందని, దీనితో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారన్నారు. ఇంత ఘటన జరిగినా సర్పంచ్‌కి చీమ కుట్టినట్లుగా కూడా లేదన్నారు. వెంకటేష్ ఆరోగ్య పరిస్తితి విషమంగా ఉన్నదని, ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్పొరేట్ తరహా వైద్యాన్ని అందించాలని, విధుల్లో తిరిగి చేరేలోగా సేలవుతో కూడిన వేతనాన్ని ఇవ్వాలని, సర్పంచ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, గ్రామ పంచాయతీ కార్మికుల అందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, టీఆర్ఎస్ కె.వి యూనియన్ల నాయకులు అమర్నాథ్, వేల్పుల రమేష్, వెంకట నరసయ్య, నరసింహారావులు మాట్లాడుతూ జరిగిన ఘటనకు సర్పంచ్ బాధ్యత వహించాలని, లేని యెడల రాబోయే రోజులలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ధర్నా అనంతరం జేసీ వెంకటేశ్వర్లుకి వినతి పత్రం ఇవ్వగా జరిగిన ఘటన దురదృష్టకరమని, వెంకటేష్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని జేసీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సాయి రత్న, బిచ్చు, ఏఐటీయూసీ నాయకులు జాడి సురేష్, పూర్ణ, కుర్శం జయ తదితరులు నాయకత్వం వహించారు.