Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమ డిజిటల్ క్రిప్టో కరెన్సీపై బాధితుల ఫిర్యాదు
- మహబూబాబాద్ జిల్లా ఎస్పీకి కంప్లైన్ట్
- 'నవతెలంగాణ' కథనంతో బాధితుల్లో చలనం
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కిభో డిజిటల్ అక్రమ క్రిప్టో కరెన్సీ పేరుతో కొనసాగుతున్న ఆర్థిక దోపిడీపై మహబూబాబాద్ జిల్లా ఎస్పీకి బాధితులు సోమవారం ఫిర్యాదు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాలల్లో సుమారు రూ.2,500 కోట్ల ఆర్థిక దోపిడీకి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. ' నవతెలంగాణ' దినపత్రికలో కథనం వెలువడటం బాధితుల్లో ధైర్యం నింపింది. సుమారు 5 కోట్ల మంది ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ కు చెందిన భాస్కర్ రావును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన ప్రవీణ్ రాజ్, టేకులగూడెం వాసి కర్నె మోహన్ రావులు కిభో అనే అక్రమ క్రిప్టో కరెన్సీ కంపెనీలో జాయిన్ చేయించారు. తదుపరి క్రిప్టో కరెన్సీ నిపుణులను సంప్రదిస్తే ఒక క్రిప్టో కరెన్సీకి ఉండవలసిన కనీస లక్షణాలు 'కిభో'కు ఎంతమాత్రం లేవని తెలియడంతో భాస్కర్ రావు మోసపోయినట్లు గ్రహించారు. తనలాగా ఇతరులు మోసపోవద్దనే సామాజిక దృక్పథంతో భాస్కర్ రావు కిభో అక్రమ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే 'నవతెలంగాణ'లో కథనం వెలవడడంతో కిభోకు చెందిన కొందరు సూపర్ సీఈవోలు, సీఈఓలు నయానో భయానో ఒప్పించి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అయినప్పటికీ భాస్కరరావు, మరో బాధితుడు నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిభోకు చెందిన కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు వాపోయారు.
కిభో సృష్టికర్త కిలపర్తి వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలి..
విశాఖపట్నానికి చెందిన కిభో సృష్టికర్త, అధినేత కిలపర్తి వెంకట్రావు. ఈ అక్రమార్జనకు ప్రధాన కారకుడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ''కిభో అనేది ప్రపంచంలోనే నిజమైన క్రిప్టో కరెన్సీ. అది మీకు రూ. 500/- లకు ఇస్తున్నాను. దానితో 500 కాయిన్స్ మీకు వస్తాయి. మార్చ్ 31, 2023 నాటికి జాయినింగ్స్ మూతపడతాయి. ఈలోపు ఎంతమందిని చేర్పిస్తే అన్ని కాయిన్స్ ఒకటి నుంచి 25 లెవెల్స్ వరకు విపరీతంగా సంపాదించుకోవచ్చు. ఒకరిని జాయిన్ చేయిస్తే మగవారికి 150 రెఫరల్ కాయిన్స్, ఆడవారికి 350 కాయిన్స్ ఇస్తాను. మార్చ్ 31, 2023 వరకు ఈ కిభో కాయిన్ ధర ఒక్కంటికి రూ.1000/- ఉండొచ్చు. అప్పటికీ ఊహించలేని డబ్బు లక్షల కోట్లల్లో వస్తుంది. మిమ్ములను కోటీశ్వరులను చేస్తాను. మీరు పరుగెత్తండి. కుమ్మేయండి. దున్నేయండి'' అని వాయిస్ మెసేజస్, ఫోన్ కాల్, యూట్యూబ్ ఛానెల్, వీడియో, ఆడియో ప్రసంగాలతో పేద, మధ్యతరగతి, బడుగు బలహీనర్గాల ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దోపిడీ చాలదన్నట్లు ప్రతీ నెల కాయిన్ రేటు పెరగుతుందని తనకు నచ్చిన విధంగా ఒక కాయిన్ రూపాయి విలువ ఉన్నదాన్ని ప్రస్తుతం రూ.500/ విలువ అయిందని వెబ్ సైట్ లో చూపిస్తూ తమను మోసం చేశారని వాపోయారు. సాధారణంగా ప్రపంచ క్రిప్టో కరెన్సీ ఏ కాయిన్ కంపెనీ చరిత్ర చూసినా ఆయా కంపెనీలు ముందుగానే వారి కమ్యూనిటీ (జన సమీకరణ) పెంచుకోవడానికి ఫ్రీ కాయిన్ మైనింగ్ ఇస్తాయి. కాని కిలో అధినేత మాత్రం డబ్బుతోనే కమ్యూనిటీనీ పెంచుకున్నాడని ఆరోపించారు. కిభో మైనింగ్ ఈనెల 21 తో ముగుస్తుండడంతో కే - వాలెట్ పేరుతో మరో దందాకు తెర తీసే ప్రయత్నాల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. కీభోకు చెందిన సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకొని ఆర్థిక దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిందిగా బాధితులు తమ ఫిర్యాదులో కోరారు.