Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి పువ్వాడ అజయ్ హామీ
నవతెలంగాణ- ఖమ్మం
గొర్రెల పంపిణీ పథకంలో ఉన్న సమస్యలను గొర్రెల మేకల పెంపుకుందారుల సంఘం(జిఎంపిఎస్) రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దృష్టికి సోమవారం క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతలచెర్వు కోటేశ్వరావు, తుశాకుల లింగయ్య మాట్లాడుతూ గొర్రెల బదులు నగదు బదిలీ ద్వారా పథకం అమలు చేసి అవినీతికి అవకాశం లేకుండా చూడాలని కోరారు. ఒకవేళ గొర్రెలే పంపిణీ చేసిన యాదవ, కురమ యువతకు గొర్రెల బదులు దళిత బంధులాగా ఇతర యూనిట్ల కొనుగోలుకు అవకాశం కల్పించాలని, జిల్లాకు చిత్తూరు, నెల్లూరు, కర్ణాటక జిల్లాలలో కొనుగోలు చేయాలని నిర్ణయించారని, ఈ ఎండలకు ప్రయాణంలోనే సగం మరణించే అవకాశం ఉన్నందున ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో కాపర్లకు నచ్చిన చోట కొనుగోలుకు అవకాశం కల్పించాలని కోరారు. ఇవే కాకుండా గొర్రెల గ్రౌండింగ్ కమిటీలో పశువైద్యాధికారులు ఉండాలని, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల బదులు గతంలో మాదిరిగా సొసైటీ అధ్యక్షులు సంతకాలతో అవకాశం కల్పించాలని అన్నారు. చనిపోయిన సభ్యుల నామినీకి ఫ్యామిలీ సర్టిఫికెట్ కాకుండా మరణ ధ్రువీకరణ పత్రం ద్వారా అవకాశం కల్పించాలని కోరారు. జిల్లాలో 33,568 మంది సభ్యులలో ''బి'' లిస్టులో 16,228 మంది సభ్యులు ఉన్నారని, వీరిలో ఇప్పటికే 9,000 మంది సుమారు 40 కోట్ల రూపాయల వాటా దానం చెల్లించి పది నెలలు అవుతుందని, ఇప్పుడు మిగతా సభ్యులు వాటాదనం చెల్లిస్తున్నందున కాపరులు ఇబ్బంది పడకుండా నిర్దిష్ట గడువులోగా గ్రౌండ్ చేయాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మొర్రి మేకల అమరయ్య, గజ్జి సూరిబాబు, నరేష్, మధు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.