Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం - కొరివి జాతీయ రహదారి
- అభివృద్ధికి రూ.124.80 కోట్లు మంజూరు
- ఈ మేరకు కేంద్రం ఆదేశాలు
- ఖమ్మంరూరల్ మండలంలో పలుచోట్ల 4 లైన్లుగా రోడ్ల విస్తరణ, డివైడర్స్, సెంట్రల్ లైటింగ్
- బ్లాక్ స్పాట్స్ వద్ద భద్రతపరమైన చర్యలు
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
ఖమ్మం- కురవి జాతీయ రహదారి అభివృద్ధికి సంబంధించి ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో చేసిన కృషి ఫలించింది. ఈ జాతీయ రహదారి మార్గంలో పలు చోట్ల నాలుగు లైన్లుగా రోడ్డు వెడల్పు చేయడం, డివైడర్స్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు సంబంధించి ఎంపీ నామ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, లేఖలు అందజేసి, చేసిన కృషి ఫలితంగా వివిధ అభివృద్ధి పనులకు రూ.124.80 కోట్ల నిధులు తాజాగా మంజూరు కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ విషయమై కేంద్ర జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీతో పాటు సంబంధిత ఉన్నతాధికారులతో ప్రత్యేకించి, పలుమార్లు సమావేశమై, లేఖలు అందించిన నేపథ్యంలో కేంద్రం ఈ జాతీయ రహదారి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చిందని నామ నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం - కురవి జాతీయ రహదారిలో పెద్ద తండా జంక్షన్ నుంచి పల్లెగూడెం వరకు ఉన్న రోడ్డును నాలుగు లైన్ల రహదారిగా విస్తరించడంతో పాటు డివైడర్స్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగల్ ఇచ్చిందన్నారు. అలాగే పల్లెగూడెం నుంచి ఎం.వెంకటాయపాలెం వరకు ఉన్న రోడ్డును కూడా విస్త రించేందుకు, బ్లాక్ స్పాట్స్ వద్ద రోడ్డు భద్రతా చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి, నిధులు మంజూరు చేసిందని నామ పేర్కొన్నారు. మొదటి ప్యాకేజీ అభివృద్ధి పనులకు గాను కేంద్ర ప్రభుత్వం రూ. 57.52 కోట్లకు పరిపాలన పరమైన మంజూరు ఇస్తూ ఆదేశాలు జారీ చేసిందన్నారు. అలాగే ఇదే జాతీయ రహదారికి సంబంధించి మరో రెండు చోట్ల ప్రతిపాదించిన పనులకు కూడా కేంద్రం గ్రీన్ సిగల్ ఇచ్చి, పరిపాలన పరమైన మంజూరుకు ఆదేశాలు ఇచ్చిందని నామ చెప్పారు. ఈ జాతీయ రహదారికి సంబంధించి రెండో ప్యాకేజీలో వెంకటగిరి క్రాస్ రోడ్డు నుంచి కోదాడ క్రాస్ రోడ్డు వరకు, ఏదులాపురం జంక్షన్ నుంచి పెద్ద తండా జంక్షన్ వరకు ఉన్న రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించడంతో పాటు డివైడర్స్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు అనుమతినిస్తూ రూ.67.28 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసిందని నామ నాగేశ్వరరావు వెల్లడించారు. ఇదే క్రమంలో రోడ్డు భద్రతకు సంబంధించి (బ్లాక్ స్పాట్స్) కూడా భద్రతాపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా నిధులు మంజూరయ్యాయని నామ పేర్కొన్నారు.