Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏసీలో కూర్చొని రేణుకా స్టేట్మెంట్ ఇస్తుంది
- మృతులది హత్యలనటం పొంగులేటి అవివేకం
- బాధితులందరినీ బీఆర్ఎస్ ఆదుకుంటుంది : ఎమెల్సీ తాతా మధు
నవతెలంగాణ-కారేపల్లి
చీమలపాడు ఘటన దురదృష్టకరమైనది, బాధితులకు సాయం చేయాల్సింది పోయి పూటకో స్టేట్మెంట్లు ఇస్తూ కొందరు పైశాచికానందం పొందుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధు విమర్శించారు. చీమలపాడు ఆత్మీయ సమ్మేళనంలో గ్యాస్ బండ పేలుడు ఘటనలో గాయపడిన కారేపల్లి మండలం గేటుకారేపల్లికి చెందిన విలేకరి తేళ్ల శ్రీనివాసరావును ఎమ్మెల్సీ తాత మధు మంగళవారం గేటుకారపల్లి వచ్చి బాధితుడిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ చీమలపాడు ఘటనపై మాజీ ఎంపీ రేణుకా చౌదరి ధర్నా చేయటం అవివేకమన్నారు. ముఖానికి వేసుకున్న మేకప్ పోతుందని ఏసీలో కూర్చోని స్టేట్మెంట్లు ఇవ్వటం ప్యాషనైపోయిందన్నారు. ప్రమాద ఘటనలో మృతి చెందితే అది రాజకీయ హత్యలని, తనతో పాటు ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌పై మర్డర్ కేసు పెట్టాలని మాజీ ఎంపీ పొంగులేటి స్టేట్మెంట్లు ఇస్తున్నారని, అది ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలిచి ఆదుకుం టుందన్నారు. సీఎం ఆదేశాలతో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం ప్రకటించటం జరిగిందని, దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ వద్ద ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. స్ధానిక తహసీల్ధార్ క్షేత్రస్ధాయి పరిశీలన రిపోర్టు ఆధారంగా ఆందజేయటం జరుగుతుంద న్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవటానికి ఇంటికో ఉద్యోగం, డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. క్షతగ్రాతులకు ఆర్ధిక సాయంతో పాటు కృత్రిమ కాళ్లు ఏర్పాటు, వెహికిల్స్ అందజేయట జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు(డీవీ), బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉప్పల వెంకన్న, మండల అధ్యక్షులు పెద్దబోయిన ఉమాశంకర్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, జిల్లా నాయకులు అజ్మీర వీరన్న, ముత్యాల వెంకటప్పారావు, భాగం నాగేశ్వరరావు, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సోసైటీ అధ్యక్షులు దుగ్గినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు దారావత్ మంగీలాల్, సంత ఆలయ చైర్మన్ అడ్డగోడ ఐలయ్య, ఎంపీటీసీ దారావత్ పాండ్యానాయక్, సర్పంచ్‌లు భూక్యా రంగారావు, మాలోత్ కిషోర్,బానోత్ కుమార్, మండల నాయకులు పిల్లివెంకటేశ్వర్లు, ఎర్రబెల్లి రఘు, వాంకుడోత్ నరేష్ పాల్గొన్నారు.