Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యమ కారుడినైన నన్ను చిన్న చూపు చూస్తారా..?
- రమ్మని ఆహ్వానిస్తే ఇల్లంతా నాదే అన్నట్లుంది
- కమల్ రాజ్ పై నిప్పులు చెరిగిన బొమ్మెర రామ్మూర్తి
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
''ఉద్యమాలు చేశాను.. లాఠీ దెబ్బలు తిన్నాను.. ఇప్పటికీ అనేక కేసుల్లో ఉన్నాను.. టీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇన్ చార్జిగాత ఎనిమిది ఏళ్లు పని చేశాను.. అయినా ఎలాంటి పదవులు లేవు.. లేకున్నా ఎవరూ లేని సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని, పార్టీని తిరుగులేని శక్తిగా పెంచిన నాకు ఇన్ని అవమానాలా..?'' అంటూ తెలంగాణ ఉద్యమ నేత బొమ్మెర రామ్మూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. చింతకాని మండలం నాగులవంచలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొమ్మెర మాట్లాడుతూ 'గత నాలుగు సంవత్సరాలుగా అవమాన పరుస్తున్నా భరిస్తున్నా.. పార్టీ కార్యక్రమాలకు పిలువకపోయినా సహిస్తున్నా.. నా ఫొటోలు ప్లెక్షీల్లో పెట్టనీయకుండా నా అనుచరులను కూడా అవహేళన చేస్తున్నా తట్టుకుని నిలబడుతున్నా.. అసలు నేను చేసిన పాపం ఏంటి..? మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించడమే నేను చేసిన తప్పా..?'' అని బొమ్మెర రామ్మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని అధోగతిపాలు చేసి, నాశనం చెయ్యాలని చూస్తున్న బీఆర్ ఎస్ పార్టీ ఇంచ్చార్జీ, జడ్పీ చైర్మన్ కమల్ రాజు పై చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దలను కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు. తాను వివిద పార్టీలు మారిన వ్యక్తిని కాదని, అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టిన వాణ్ణి కాదని పరోక్ష విమర్శ చేశారు. ఒకరు కారు ఇచ్చి, ఒకరు డిజిల్ పోసి, నెలనెల ఖర్చులు ఇస్తే పార్టీలో తిరిగే వాణ్ణి కానే కాదని ఎద్దేవా చేశారు. సొంత డబ్బుతో నాటి నుంచి నేటి వరకు శక్తి మేరకు తిరుగుతూ ప్రజల గుండెల్లో ఉద్యమ కారుడిగా స్థానం పొందానని తెలిపారు. బలమైన బందువులు, ఉద్యమకారులు అన్ని వర్గాలకు తలలో నాలుకలా బతుకుతున్న తను మండలంతో పాటు బోనకల్లో ఒక తెలంగాణ అమరవీరుల స్థూపం, ఒక జయశంకర్ సార్ విగ్రహం తాను పార్టీ ఇంచ్చార్జిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేశానని చెప్పారు. ప్రతి గ్రామంలో పార్టీ జెండా దిమ్మెలను నిర్మించానన్నారు. ఈ ప్రాంతం నుంచి తెలంగాణ ఉద్యమ సమయంలో రైలురోకో లో రైలు తగుల పెట్టి చంచల్ గూడా జైలుకు వెళ్ళిన వ్వక్తిని తాను అని, తనను బోనకల్ మండల పార్టీ ఆత్మీయ సమావేశానికి ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ''నేను చేసిన తప్పేంటి.? నిన్ను ఈ పార్టీలోకి తీసుకురావడమే నేను చేసిన తప్పా..? రెండు సార్లు ఓడిపోయిన నిన్ను మూడో సారి గెలిపించడానికి నా శక్తి మేరకు పని చేయడమే తప్పా..? పార్టీ బాగుంటే అందరం బాగుంటాం.. పార్టీని ఎదగనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నావు..? అని అడిగారు. ఈ విషయాలపై చర్చించి తగు చర్యలు తీసుకొని ఇప్పుడు తానేమి చెయ్యాలో ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి ఆయన విన్నవించారు.