Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్‌కు జీపీ కార్మిక ఉద్యోగుల జేఏసీ వినతి
- కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి
- ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి
- జేఏసీ చైర్మెన్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్
నవతెలంగాణ-పాల్వంచ
వెంకటేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్ అనుదీప్‌ను గ్రామ పంచాయతీ కార్మిక ఉద్యోగుల జేఏసీ చైర్మెన్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 13న టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డులో సర్పంచ్ మాలోత్ సురేందర్ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ భూక్యా వెంకటేశ్ విద్యుత్ పోల్ పైకి ఎక్కి షాక్‌కు గురై తీవ్ర గాయాలపాలై ఒళ్లు కాలిపోయి ఉస్మానియా ఆసుప్రతిలో గత 7 రోజులుగా చికిత్స పొందుతూ రెండు కాళ్లను కూడా తీసివేయడం జరిగిందని తెలిపారు. గ్రామపంచాయతీ కార్మికుల ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాలడుగు భాస్కర్, జేఏసీ చైర్మెన్ ఏజే రమేష్ ఉస్మానియా ఆసుపత్రిలో వెంకటేశ్‌ను పరామర్శించిన అనంతరం గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ అనుదీప్‌ను కలిసి వినతిపత్రం అందజేసి వెంకటేశ్ పరిస్థితి గురించి వివరించారు. వెంకటేశ్ పరిస్థితి విషమంగా ఉందని, రెండు కాళ్లు సర్జరీ చేసి తొలగించారని ఊపిరితిత్తులు, గుండె బాగా దెబ్బతిన్నాయని అయినప్పటికీ డాక్టర్స్ అయనను కాపాడేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆహారం తీసుకోలేని పరిస్థితి ఉందని, రెండేండ్ల బాబు, నాలుగు ఏండ్ల పాప ఉన్నారని తెలిపారు. భార్య కుటుంబం అంతా తీవ్ర రోదనతో భయంభయంగా బతుకు ఈడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేష్ అన్న తన తమ్ముడిని కాపాడాలని కలెక్టర్‌ను వేడుకున్నాడు. అనంతరం ఏజే రమేశ్ కలెక్టర్‌తో మాట్లాడుతూ వెంకటేశ్ కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం అందేలా చూడాలని, ఘటనకు కారణమైన ఎంపీడీఓ, విద్యుత్ లైన్మెన్, సర్పంచ్‌లపై చర్యలు తీసుకోవాలని కోరారు. వెంకటేశ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సాగుభూమి 2 ఎకరాలు, సొంత ఇళ్లు ప్రభుత్వమే మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కుటంబాన్ని అన్ని విదాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చిన కలెక్టర్, డీపీఓకు మొత్తం విషయాలు చెప్పి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసిని ప్రతినిధి బృందంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేశ్, జేఏసి కన్వినర్, గ్రామపంచాయతీ కార్మికుల ఉద్యోగుల సంఘం సీఐటీయూ అధ్యక్షులు మాలోత్ సతీష్, జేఏసీ కన్వినర్ ఐఎఫ్టీయూ జిల్లా అద్యక్షులు గౌని నాగేశ్వరరావు, సరికొంద నాగేశ్వరరావు, జేఏసి, ఎఐటియుసి నాయకులు జాడి సురేష్‌కుమార్, కిశోర్‌కుమార్, ఐఎఫ్టియు నాయకులు భాస్కర్, బిఆర్ఎస్కెవి పూర్ణ, సిఐటియు నాయకులు పూర్ణ, వీరన్న తదితరులు పాల్గొన్నారు.