Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగ్గుతున్న భూగర్భ జలాలు
- పెరుగుతున్న తాగునీటి కష్టాలు
''భానుడి భగభగతో రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్రజలు గుక్కడు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేద. మండల వ్యాప్తంగా నెలకొని ఉన్న తాగునీటి సమస్యపై నవతెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం''
- పట్టించుకోని అధికార యంత్రాంగం
నవతెలంగాణ-చర్ల
నిండు వేసవి సమీపించడంతో భానుడి భగభగలతో ఎండలు మెండుగా ఉన్నాయి. దీంతో భూగర్భ జలాలు అడుగంటాయి. ఎండలకు మండలంలోని నీటి వనరులైన వాగులు, వంకలు, చెరువులతో పాటు నదుల్లో సైతం నీటి మట్టాలు తగ్గి సమీప బావులు, బోరు బావుల్లో పూర్తిగా నీరు లేకుండాపోవడంతో మండల ప్రజలకు మంచినీటి కష్టాలు రోజురోజుకు జటిలమవుతున్నాయి. తాగునీటి కష్టాలు తీర్చేందుకు కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేసి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ మండల వ్యాప్తంగా ఆశించినంత మేర ఫలితాలు ఇవ్వకపోవడం నీటి కష్టాలు అంతాఇంతాకాదు. వ్యవసాయ ఆధారిత మండలంగా ఉన్న చెర్ల మండలంలో మిషన్ భగీరథ వైఫల్యం వలన తాగునీటి కోసం భగీరథ కష్టాలు పడాల్సి వస్తుంది.
మిషన్ భగీరథ చేసే పనులు
కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ ఇంట్రా, గ్రిడ్ అనే రెండు భాగాలుగా విడిపోయి ప్రజలకి తాగునీరు అందించాల్సి ఉంది. అయితే ఈ రెండు విభాగాల్లో ఉన్న అధికారుల నిర్లక్ష్యం నేడు మండలంలో తాగునీటి కష్టాలు వర్ణాతీరం. రాష్ట్ర వ్యాప్తంగా 2015లో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పనులు మండలంలో మాత్రం 2018లో పూర్తిచేసుకుని తాగునీటి అందించడంలో చొరవ చూపగా ఇప్పటికీ మండల వ్యాప్తంగా సుబ్బంపేట, పూసగుప్ప, చింతగుప్ప, కుర్నపల్లి, గొంపల్లి, ఆనంద కాలనీ, చలమల తిప్పాపురం మొదలైన ఆదివాసి గ్రామాలలో నీటిని అందించడంలో పూర్తిగా విఫలమైందని పలువురు సామాజిక కార్యకర్తలు అంటున్నారు. మిషన్ భగీరథ స్కీంలో పాత ట్యాంకులకు కొత్త రంగు వేసి అలంకారప్రాయంగా చూసుకోవడానికి మినహా ఆ మంచినీటి ట్యాంకులు వలన ఏమాత్రం ఉపయోగం లేదని ప్రజలు గగ్గులు పెడుతున్నారు. మండల వ్యాప్తంగా 104 మంచి నీటి ట్యాంకులు ఉండగా సుమారు 60 శాతం నీటి ట్యాంకులకు తాగునీరు సరఫరా రోజు జరగడం లేదంటంలో అతిశయోక్తి ఏమీ లేదు. అదేమని అధికారులను అడగగా అంతు పంతులు లేని సమాధానాలతో తెప్పదాటు వ్యవహారాన్ని అనుసరిస్తున్నారని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న బోరు బావులు మరమ్మతులకు గురవడంతో మరమ్మతులు చేయించేందుకు నిధులు లేక గ్రామపంచాయతీ సర్పంచులు, అధికారులు నానాఅవస్తులు పడుతుంటే మిషన్ భగీరథ ఉంది కదా అనే కుంటి సాగు చెప్పి అధికార యంత్రాంగం చంకలు గుద్దుకోవడం మినహా ప్రభుత్వ అధికారులు చేసేది ఏమీ లేదని ప్రజలు బాహా టంగా విమర్శిస్తున్నారు. భగీరథలో ఉన్న రెండు విభాగాల్లో అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడం, నిధులు లేకపోవడం తో పాటు ఈ మధ్యకాలంలో అప్రకటిత విద్యుత్ కోతల వలన తాగునీటి కష్టాలు తారాస్థాయికి చేరుకున్నాయని పలువురు ఆందోళన చెందుతున్నారు.
పట్టించుకోని ఉన్నతాధికారులు
తాగునీటి కోసం ఒక పక్క ప్రజాప్రతినిధులు ప్రజలు అదేపనిగా ఆందోళన చేస్తున్నప్పటికిని ప్రభుత్వ అధికారులలో చలనం లేక దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ఇకనైనా కలెక్టర్ మండల తాగునీటి సమస్యపై దృష్టి సారించి మేజర్ గ్రామపంచాయతీ సాయి నగర్, విజయ కాలనీతో సహా ఆయా ఆదివాసీ గ్రామాలలో తాగునీరు సక్రమంగా అందే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.