Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2022, జూలై 16 తెల్లవారుజామున ఒంటిగంటకు భద్రాచలం వద్ద 71.3 అడుగుల గోదావరి... అప్పటికే ఏజెన్సీ అంతా జలదిగ్బంధం... మరోవైపు భద్రాచలాన్ని ఆనుకున్న ఎటపాక వద్ద కరకట్టకు గండి... బ్రిడ్జి పక్కన కరకట్ట లీకు. బ్రిడ్జికి సమాంతరంగా వరద నీరు.... ఈ వరద బీభత్సాన్ని కల్లారా చూసిన భద్రాచలం ఏజెన్సీ వాసుల గుండెలు జల్లుమన్నారు... ఏం జరుగుతుందో తెలీని ఆందోళన... బతికి బట్ట కడతామా లేదా అన్న ఆవేదన...ఎట్టకేలకు శాంతించిన గోదావరితో ఊపిరి తీసుకున్న మన్నెం బిడ్డలు..
ఇది గత ఏడాది ఏజెన్సీ వాసుల గోదావరి గోడు. మళ్లీ వరదల కాలం రానే వస్తోంది. మరో రెండు నెలలే మిగిలి ఉంది. గత ఏడాది వరద రక్షణ చర్యలు కంటి తుడుపు చర్య గానే మిగిలాయి. ప్రణాళికలకే పరిమితమయ్యాయి. ఎటు వంటి రక్షణ చర్యలు ప్రారంభానికి నోచుకోకపోగా, మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైతే ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానమే లేదు. భద్రాద్రి మన్యం వరద ఆందోళన దయనీయస్థితిపై నవతెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం...
- ప్రణాళికలకే పరిమితమైన వరద అంచనాలు
- ఆచరణకు నోచుకోని రక్షణ చర్యలు
- ఏజెన్సీ వాసులకు ఏది భరోసా...?
- ఆనాటి వరద బీభత్సం మరిచారా
- మన్యంకు మళ్ళీ పొంచి ఉన్న వరద ముప్పు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం ఏజెన్సీ అంటేనే వరద ప్రాంతం. ప్రతి ఏటా వరదలు ముంచేత్తుతుంటాయి. ప్రజలు ప్రాణ, ధన నష్టాన్ని చవి చూడటం పరిపాటిగా మారిపోయింది. అయితే గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో కనీసం భద్రాచలం పట్టణాన్ని అయినా వరద ముంపు నుంచి కాపాడే ప్రయత్నం జరిగింది. భద్రాచలం వద్ద కరకట్ట నిర్మాణంతో పుణ్యక్షేత్రవాసులు కాస్తయినా వరద భయం నుంచి బయటపడ్డారు. అయితే గత ఏడాది 2022లో ఈ ప్రాంతంలో వరదలు ఉప్పొంగాయి. ఈ ఒక్క సంవత్సరమే ఐదు సార్లకు పైగా మూడవ ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహించటం గమనార్హం. 2022 జూలై 16వ తేదీన భద్రాచలం వద్ద 71.3 అడుగుల గోదావరి నీటిమట్టం నమోదయింది. అయితే 1986లో భద్రాచలం వద్ద 74.5 అడుగుల గోదావరి నీటిమట్టం నమోదైనప్పటికీ గత ఏడాది వచ్చిన అత్యధిక వరద నీరు ఏజెన్సీ వాసులను తీవ్ర కలవడానికి గురిచేసింది. దాదాపు 24 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించింది. అప్పటికే అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఏజెన్సీ జల దిగ్బంధమైంది. వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. భద్రాచలం మన్యంలో ఉన్న దాదాపు అన్ని ప్రాజెక్టులు నీటితో నిండిపోయాయి. చెరువులు, కుంటలు, వాగులు వంకలు నిండిపోయాయి. ఇక భద్రాచలం వద్ద కూడా పరిస్థితి అదుపుతప్పింది. పట్టణంలోని బ్రిడ్జి సమీపంలో కరకట్టకు స్వల్పంగా గండిపడి వరద నీరు పట్టణంలోకి ప్రవేశించింది. మరోవైపు ఎటపాక వద్ద కరకట్టకు గండి పడింది. సమీప ప్రాంతం జలమయమైంది. భద్రాచలం బ్రిడ్జి వద్ద భీములకు సైతం దాదాపు వరద నీరు తాకింది. మరో అడుగు వస్తే... ఇక భద్రాచలం అంతేనన్న భయంతో కునుక్కు నిద్ర లేకుండా స్థానికులు రాత్రంతా పడికాపులుకాశారు. ఎట్టకేలకు అదే రోజు గోదావరి శాంతించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం అంతా రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. అధికారులు కూడా హైరానా పడ్డారు. ఎన్ని రక్షణ చర్యలు చేపట్టిన వరదనాపే పరిస్థితి లేకుండా పోయింది. బ్రిడ్జి పై వాహనాల రాకపోకలు నిలిపేయడంతో ఇక తలదాచుకోవటానికి కూడా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ తలుచుకుంటేనే స్థానికులకు మింగుడు పడని అంశం. ఇంత జరిగినప్పటికీ నేటికీ ఏమైనా పూర్తిస్థా యి రక్షణ చర్యలు చేపట్టారా అంటే...? అదేమీ లేదు అని చెప్పటానికి కూడా మాటలు రాని ధైన్యం. ఆనాటి వరదల సందర్భంలో... ముఖ్యమంత్రి కెసిఆర్ భద్రాచలం వచ్చి వరద పరిస్థితిని పరిశీలించారు. రూ.1000 కోట్లతో భద్రాద్రి మన్యం రక్షణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇందులో కరకట్టలు పటిష్టం చేయటంతో పాటు, ముంపు ప్రజలకు సురక్షిత ప్రాంతాల్లో కాలనీలు ఏర్పాటు చేయటం. ఇవన్నీ కూడా ఆనాటి ప్రకటనలకే పరిమితమయ్యాయి. అధికారులు మాత్రం అంచనాలు తయారు చేశారు. కానీ ఇవి ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వేసిన దాఖలాలు లేవు.
ఆచరణకు నోచుకోని రక్షణ చర్యలు :
భద్రాచలం, బూర్గంపాడు గోదావరి పరివాహక ప్రాంతం చుట్టూ ఇరువైపులా కరకట్టను పటిష్టం చేయటానికి అంచనాలను తయారు చేశారు. బూర్గంపాడు మండలం సంజీవరెడ్డి పాలెం నుంచి, తాళ్ల కొమ్మూరు మీదుగా నెల్లిపాక బంజర్, మోతే, ఇర వెండి, అశ్వాపురం అమ్మగారిపల్లి వరకు ఇరువైపులా కరకట్టను పటిష్టం చేయటంతో పాటు, అక్కడక్కడ తూముల ఏర్పాటు చేయాలని అంచనాలను తయారు చేశారు. ఫీల్డ్ లెవల్ సర్వే మాత్రం జరగలేదు. పోలవరం నిర్మాణం వల్లనే బ్యాక్ వాటర్ తో భద్రాచలం ఏజెన్సీ జలదిగ్బంధంలో చిక్కుకుంటూ ఉందని, ఇక్కడి కరకట్టల పటిష్టం చేయాలంటే కోట్లాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి మరి ఈ వ్యయం ఎవరు భరించాలి అని ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సమాలోచనలకే పరిమితమైన నేపథ్యంలో... భద్రాద్రి రక్షణ చర్యల అంశం ఒక్క అడుగు ముందుకు పోని పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు ప్రభుత్వాల నాటకాలతో భద్రాచలం మన్యం ప్రజలు అడకత్తెరలో పోక చెక్కలా నలిగిపోతున్నారు.
ఏజెన్సీ వాసులకు ఏది భరోసా...?!...
ఇక వచ్చే జూన్ నుంచి భద్రాచలం మన్యం కు వరదల సీజన్ అనే చెప్పాలి. జూన్ నుంచి మొదలు సెప్టెంబర్ వరకు మన్యంకు వరద పొంచి ఉంటుంది. ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద కనీసం ప్రస్తుతం ఉన్న కరకట్టనైనా పటిష్టం చేయాల్సి ఉంది. గత ఏడాది స్లోయిసులు లీక్ అయ్యాయి. దీంతో వరద పట్టణంలోకి ప్రవేశించింది. మొత్తం ఎనిమిది స్లూయిస్ లు ఉన్నాయి. వీటిని పూర్తిస్థాయిలో రిపేర్ చేయాల్సి ఉంది. ప్రధానంగా మూడు స్లూయిసులు పూర్తిస్థాయిలో పటిష్ట పరచాల్సి ఉంది. భద్రాచలం పట్టణంలోని విస్తా కాంప్లెక్స్ వద్ద గత ఏడాది వరదల సందర్భంలో మూడు మోటార్లను పెట్టి పనిచేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఎక్కువ రోజులు ఈ మోటార్లు నిరాటంకంగా పనిచేయటం వల్ల కొంత వరద నీరు లోపటికి వచ్చింది. ఇంకా అధునాతనమైన మోటార్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. 50 హార్స్ పవర్ మోటార్లు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇసుక బస్తాలను ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున సమకూర్చుకోవాల్సి ఉంది. గత ఏడాది పదివేల ఇసుక బస్తాలు మాత్రమే ముందస్తుగా అందుబాటులో ఉంచారు. అయితే అది చాలక పోవడంతో యుద్ధ ప్రాతిపదికన లారీల్లో ఇసుక బస్తాలు తీసుకురావాల్సి వచ్చింది. ఇంకా ఈ ఏడాది వీటి సంఖ్య మరింత పెంచి అందుబాటులో ఉంచుకోవాల్సి ఉంది. గత ఏడాది వరదలను దృష్టిలో పెట్టుకొని, నూతన వరదల మాన్యువల్ ను రూపొందించుకొని, ఆ దిశగా అధికారులు ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇంతవరకు వరదల సమీక్ష సమావేశం జరగలేదు.
గత వరదల హామీలను అమలు చేయాలి
గత వరదల సందర్భంగా సీఎం కేసీఆర్ కరకట్టల పటిష్టానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంత్రి పువ్వాడ అజరు కుమార్ పోలవరం బ్యాక్ వాటర్ వల్లనే, పోలవరం ఎత్తు వల్లనే ఏజెన్సీలో భారీగా వరద నష్టం సంభవించిందని ఆనాడు పేర్కొన్నారు. తెలంగాణ,ఆంధ్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి కేంద్రం చొరవతో సీరియస్ గా చర్యలకు ఉపక్రమిస్తే ఏజెన్సీని వరద ముప్పు నుంచి కాపాడవచ్చు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఆలోచన చేయాలి. పోలవరం నిర్వాసితుల లాగానే భావించి ఆర్ఆర్ ప్యాకేజీని అమలు చేయాలి. ఇరిగేషన్, ఆర్అండ్బి శాఖలను సమన్వయపరిచి పరిపాలన పరమైన చర్యలు తీసుకోవాలి. కరకట్టను అటు ఇటు పెంచి, పొడిగించి భద్రాచలం మన్యం వాసులను శాశ్వత ప్రాతిపదికన వరద ముంపు నుంచి కాపాడాలి.
- మచ్చా వెంకటేశ్వర్లు, సీపీ(ఐ)ఎం నియోజకవర్గం కన్వీనర్