Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి
- ఐటీడీఏ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో హాస్టల్ వర్కర్ల ధర్నా
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోస్ట్ మెట్రిక్ కాలేజీ హాస్టల్స్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు క్యాటరింగ్ విధానం జీవో నెంబర్ 527ను రద్దుచేసి రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ జీవో నెంబర్ 60 ప్రకారం నెలకు రూ.15,600 వేతనం చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి డిమాండ్ చేశారు. క్యాటరింగ్ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్స్ డైలీ వేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఐటీడీఏ ఎదుట ధర్నా గురువారం నిర్వహించింది. ఈ ధర్నా సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బ్రహ్మచారి మాట్లాడారు. వేతనాలు పెంచాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా క్యాటరింగ్ జీవోను తీసుకొచ్చి ప్రస్తుతం కార్మికులు పొందుతున్న రూ.12 వేల వేతనాన్ని రూ.3000 వేలకు తగ్గించి రూ.9000 వచ్చే విధంగా క్యాటరింగ్ జీఓ తెచ్చారని ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2017లో వచ్చిన జీవోని 2023లో అమలు చేయాలని కోరుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. ఆరు సంవత్సరాలుగా పెండింగ్లో పెట్టిన జీవోని ఇప్పుడు అమలు చేయాలని ఆలోచన చేయడం గిరిజన సంక్షేమ వ్యతిరేక చర్యగా సీఐటీయూ పేర్కొన్నది. రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని, ప్రయివేటు ఏజెన్సీల పాత్రని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డైలీవేస్ కార్మికులకు పెండింగ్లో ఉన్న నాలుగు నెలల జీతాలు ఔట్సోర్సింగ్ కార్మికులకు పెండింగ్లో ఉన్న 21 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్ జమల్లో అనేక తప్పులు జరిగాయని చాలామంది కార్మికులకు ఎకౌంట్లో పిఎఫ్ జమ కాలేదని జమ అయిన వారిలో కూడా తక్కువ డబ్బులు జమ చేశారని ఈ తప్పులన్నింటినీ సరిచేయాలని డిమాండ్ చేశారు. డైలీ వేజ్ వర్కర్లుగా పనిచేస్తూ మరణించిన కార్మికుల వారసులను డైలీ వేజ్ వర్కర్లుగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సమస్యలతో కూడిన వింత పత్రాన్ని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవికి అందజేశారు. క్యాటరింగ్ జీవోని మార్పు చేసి వేతనాలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని డీడీ పేర్కొన్నారు. సమస్యల పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని సీఐటీయూ పేర్కొంది. ఈ ధర్నా కార్యక్రమంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్స్ డైలీ వేజ్, ఔట్సోర్సింగ్ కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి ఏ.హీరాలాల్, జిల్లా కోశాధికారి ఈసం పద్మ, జిల్లా నాయకులు జలంధర్, కౌసల్య, స్వరూప, జోడి లక్ష్మి, తిరుపతమ్మ, జయ, భద్రమ్మ, పాపారావు, తదితరులు పాల్గొన్నారు.