Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నత విద్యను పేద విద్యార్థులకు దూరం చేసే కుట్ర
- దానిలో భాగమే విదేశీ విద్యాలయాలకు ఆహ్వానం
- ఫారన్ యూనివర్శిటీలకు మన దేశ చరిత్ర ఏమి తెలుస్తుంది?
- 'నూతన విద్యావిధానం - ప్రస్తుత సవాళ్లు'పై సదస్సులో జేఎన్ యూ ప్రెసిడెంట్, ఎస్ఎఫ్ఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఐషీ ఘోష్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నూతన విద్యావిధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విద్యలో మార్పులతో మహిళలు విద్యకు దూరం అవుతారని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్ యూ) విద్యార్థి సంఘం ప్రెసిడెంట్, ఎస్ఎఫ్ఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఐషీ ఘోష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన నూతన విద్యావిధానం - ప్రస్తుత సవాళ్లు'పై సదస్సులో ఐషీ ఘోష్ మాట్లాడారు. చదువులు ప్రైవేట్, కార్పొరేట్ శక్తుల చేతిల్లోకి వెళ్తాయని, ప్రభుత్వ విద్యారంగం బాగుపడాలంటే విద్యా రంగానికి తగినన్ని నిధులు కేటాయించాలని కోరారు. ఉన్నత విద్యను పేద విద్యార్ధుల నుండి దూరం చేసేందుకు విదేశీ విశ్వవిద్యాలయాలను దేశంలోకి బీజేపీ ప్రభుత్వం ఆహ్వానిస్తోందన్నారు. విదేశీ విద్యాలయాలకు మన దేశ చరిత్ర, అర్థశాస్త్రం, రాజకీయ శాస్త్రం ఎలా అవగతం అవుతాయని ప్రశ్నించారు. పాత విద్యావిధానాన్ని ఎందుకు మార్చాల్సి వస్తుందో కూడా బీజేపీ ప్రభుత్వం చెప్పటం లేదన్నారు. బ్రిటీష్ కాలం నాటి విధానాలు తెచ్చి అమలు చేస్తున్నారని వాపోయారు. మహిళలు పూర్వం లాగా వంట గదికే పరిమితము కావాలా? చదువులు ఆపాలా? అని ప్రశ్నించారు. నూతన విద్యావిధానం పేరుతో సనాతన ధర్మాని మళ్ళీ విద్యలోకి తెస్తున్నారని వాపోయారు. దేశ జాతీయోద్యమ నాయకుల చరిత్రను సిలబస్ నుండి తొలగించటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. సెంట్రల్ యూనివర్శీటీలకు ఫండ్స్ ఇవ్వక పోవడం, ఫెలోషిప్స్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేయడం, బడ్జెట్లో నిధులు కోత లాంటివి పేద విద్యార్థులకు చదువును దూరం చేసే చర్యలన్నారు. నూతన విద్యావిధానం పేరుతో ప్రైవేట్ వ్యక్తులను అనుమతించడం, రిజర్వేషన్లు అమలు చేయకుండా ఉండటం దుర్మార్గమన్నారు. ఇది పాఠశాల విద్యలో డ్రాపవుట్స్ పెంచుతుందన్నారు. డ్రాపవుట్స్ ను పెంచటం విద్యార్థినులను చదువుకు దూరం చేయటమేనని తెలిపారు. నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా విద్యార్థినులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన విద్యావిధానం అమలు చేస్తే పేద విద్యార్థులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తమ అభిప్రాయాలను తెలపాలని కోరారు. అసెంబ్లీలో నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని అన్నారు. 90% సామాజికంగా వెనుక బడిన విద్యార్థులు ఈ విద్య విధానం వల్లన నష్టపోతారని పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు టి.ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రాష్ట్ర కమిటీ సభ్యులు ఫర్వీన్, సంఘం మాజీ జిల్లా కార్యదర్శి చింతల రమేష్, నగర కార్యదర్శి తరుణ్, నాయకులు ఉమేష్, వీరేందర్, నవ్య, రాగిణి, సుమలత, షరీఫా, అంజలి, ఉదయశ్రీ, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.