Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ వైఫల్యం వల్లే బీజేపీ ఎదుగుదల
- దేశ రక్షణ బాధ్యత కమ్యూనిస్టులదే
- ప్రజాపోరు యాత్ర బహిరంగ సభలో
మంత్రి అజయ్, కూనంనేని, పోతినేని
నవతెలంగాణ- ఖమ్మం
ప్రశ్నించే వారు జైళ్లలో మగ్గుతున్నారని, దోపిడీదారులు మాత్రం బిజెపిలో చేరి నాయకులుగా చెలామణి అవుతున్నారని సిపిఐ, బీఆర్ఎస్, సిపిఎం నాయకులు అన్నారు. సిపిఐ చేపట్టిన ప్రజాపోరుయాత్రలో భాగంగా గురువారం ఖమ్మం నగరంలోని ముస్తఫానగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఎస్కె జానిమియా అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ మాట్లాడుతూ వామపక్ష ప్రగతిశీలశక్తులు ముఖ్యంగా బిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం సమైక్యంగా పోరాడి ఉమ్మడి జిల్లాలో విజయ దుందుభి మ్రోగించాలని పిలుపునిచ్చారు. బిజెపిని అడ్డుకోవడమే బిఆర్ఎస్ ఎజెండా అన్నారు. దేశంలో రాష్ట్రంలో బిజెపికి అధికారం దక్కకూడదనే లక్ష్యంతోనే బిఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. స్వార్థం లేని కమ్యూనిస్టులు ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని, ఇప్పుడు దేశ రక్షణ ప్రధాన సమస్యగా మారడంతో దేశాన్ని రక్షించేందుకు సిపిఐ ప్రజాపోరు యాత్ర చేపట్టిందని, యాత్రకు బిఆర్ఎస్ పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తుందన్నారు. శత్రువు బలవంతుడైనప్పుడు ఐక్యంగా పోరాడాలని బిఆర్ఎస్, సిపిఐ, సిపిఎంలు ఆ దిశగా పనిచేస్తున్నాయన్నారు. ఖమ్మంజిల్లాలో మూడు పార్టీలు ఐక్యంగా పని చేసి అద్భుత విజయాలను సాధించనున్నాయని అన్నారు. బీఆర్ఎస్కు సిపిఎం, సిపిఐ రెండు కళ్ళు లాంటివని, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సహకారంతో ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థానాలు గెలిపించుకుంటామని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ దేశ రక్షణ బాధ్యత కమ్యూనిస్టులదేనని తెలిపారు. దేశం విచ్చిన్నకర పరిస్థితుల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపిని నిలువరించి దేశాన్ని రక్షించేందుకు కమ్యూనిస్టులు నడుం బిగించారని ఆయన తెలిపారు. బిజెపికి ఒక్కసారి అధికారమిస్తే తెలంగాణలో ఏమి జరుగుతుందో బండి సంజరు తెలిపారని, రూ. 500 కోట్లతో నిర్మించిన సచివాలయాన్ని కూల్చేయడం, మసీదులను కూల్చేయడమేనని ఆయన తెలిపారని, విశ్వాసాల పునాదులు పైన మసీదులు నిర్మించ బడ్డాయన్న వాస్తవాన్ని బిజెపీ జీర్ణించుకోలేకపో తుందన్నారు.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ దేశానికి బిజెపి క్యాన్సర్ కంటే ప్రమాదమని అందుకే వీళపి ప్రమాదాన్ని గుర్తించి గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యపరుస్తూ సిపిఐ ముందుకు సాగుతుందన్నారు.ఈసభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, రాష్ట్ర సమితి సభ్యులు అమ్ముల జితేందర్ రెడ్డి, యర్రాబాబు, కె. గోవిందరావు, ఏపూరి లతాదేవి, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాసరావు, కార్పొరేటర్ వెంకటనారాయణ, నాయకులు ఏనుగు గాంధీ, సాంబశివారెడ్డి, లక్ష్మీ నారాయణ, ఎండి జాకీర్, వీరన్న, సిపిఎం నాయకులు జబ్బార్, మీరా , బేగం తదితరులు పాల్గొన్నారు.