Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
నవతెలంగాణ-తల్లాడ
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్య సేకరణ పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని తల్లాడ మండలం మిట్టపల్లి క్లస్టర్ రేజర్ల కొనుగోలు కేంద్రంలో ధాన్య కొనుగోలు కేంద్రాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ లతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతుల కోసం ఏర్పాటు చేసిన ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 230 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అవసరాన్ని బట్టి ఇంకా కొనుగోలు కేంద్రాలను పెంచుతామని అన్నారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, కల్లూరు ఆర్డీవో సిహెచ్.సూర్యనారాయణ, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సోములు, వ్యవసాయ శాఖ ఏడి సునీత, తల్లాడ ఎంపిపి దొడ్డా శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీలత, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
అక్టోబర్‌లోనే ఎన్నికల నోటిఫికేషన్
తల్లాడ మండలం రామానుజవరం గ్రామంలో ఎంఎల్ఏ సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు, సమావేశంలో పువ్వాడ మాట్లాడుతూ ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, అక్టోబర్‌లో నోటిఫికేషన్ వస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, ఆసరా, షాదిముబారక్, రైతుబంధు, రైతు బీమా తదితర పథకాలను ఇంటింటికి వెళ్లి కరపత్రాలతో ప్రజలను ఎన్నికల కోసం సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ తనకు వ్యాపారాలు లేవని, కాంట్రాక్టులు లేవని, నాకు ప్రజలే బలం ప్రజలే బలగం అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఆర్వి శేషగిరిరావు, రామానుజ సర్పంచ్ సేలం కోటిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ డి.శ్రీనివాసరావు, జెడ్పిటిసి సభ్యురాలు డి.ప్రమీల తదితరులు పాల్గొన్నారు.