Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ విపీ గౌతమ్
నవతెలంగాణ-తల్లాడ/కల్లూరు
మన ఊరు- మన బడి కార్యక్రమం క్రింద చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తల్లాడ మండలం నూతనకల్, తల్లాడ, కల్లూరు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో మన ఊరు- మన బడి క్రింద చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలల పునః ప్రారంభం నాటికి పనులన్నీ పూర్తవ్వాలని, ఈ దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. నూతనకల్ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.29.65 లక్షల అంచనాలతో పనులు చేపట్టినట్లు, ఇందులో రూ.22 లక్షలు మన ఊరు-మన బడి, రూ.7.65 లక్షలు ఉపాధిహామీ నిధుల క్రింద చేపట్టినట్లు ఆయన తెలిపారు. స్లాబ్ మరమ్మత్తులు, పూర్తయినట్లు, కాంపౌండ్ వాల్, టాయిలెట్స్, విద్యుద్దీకరణ పనులు ప్రగతిలో ఉన్నట్లు ఆయన అన్నారు. తల్లాడ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల అభివద్ధి పనులు రూ.46 లక్షల అంచనాలతో చేపట్టినట్లు ఆయన తెలిపారు. డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, టాయిలెట్ బ్లాకులు, మేజర్, మైనర్ మరమ్మత్తులు, విద్యుద్దీకరణ, తాగునీటి వసతి పనులు చేపట్టినట్లు ఆయన అన్నారు. కల్లూరు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల అభివద్ధి పనులు రూ. 62 లక్షలతో చేపట్టినట్లు ఆయన తెలిపారు. డైనింగ్ హాల్, అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్, టాయిలెట్ బ్లాకుల నిర్మాణం చేపట్టినట్లు ఆయన అన్నారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని ఆయన తెలిపారు. మేజర్, మైనర్ మరమ్మత్తులు, విద్యుద్దీకరణ పనులు పూర్తి స్థాయిలో పూర్తి చేయాలన్నారు. పాఠశాలలకు మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ ఫ్లాట్ ప్యానళ్లు తరగతి గదుల్లో బిగించి, పరీక్షించాలన్నారు. బోర్డు, డిజిటల్ అన్ని అవసరాలకు ఇట్టి ప్యానళ్లు ఉపయుక్తంగా వుంటాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా కల్లూరు ఆర్డీవో సిహెచ్.సూర్యనారాయణ, పీఆర్ ఇఇ చంద్రమౌళి, టీఎస్ఇడబ్ల్యూఐసి డిఇ వైకుంఠాచారి, ఎంపిడిఓ రవీంద్రారెడ్డి, తహసీల్దార్లు శ్రీలత, బాబ్జి ప్రసాద్, ఎంఇఓ ప్రసాద్, కల్లూరు సర్పంచ్ ఎల్. రఘు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.
మినీ స్టేడియం నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి
నవతెలంగాణ-కల్లూరు/వైరా
నియోజకవర్గాల్లో మంజూరయిన మినీ స్టేడియం నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి, క్రీడాకారులకు అందుబాటులో తేవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు, వైరా నియోజకవర్గం వైరాలో మినీ స్టేడియం నిర్మాణ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రూ.3.40 కోట్ల వ్యయంతో సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరులో ఇండోర్, అవుట్ డోర్ స్టేడియంల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఇండోర్‌లో బ్యాడ్మింటిన్, కబడ్డి, జిమ్, టేబుల్ టెన్నిస్ టెన్నిస్ క్రీడలు, అవుట్ డోర్లో 400 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్, బాస్కెట్ బాల్ సింథిటిక్ కోర్ట్, వాలీబాల్, క్రికెట్, ఫుట్ బాల్, ఖోఖో, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటుచేయనున్నట్లు ఆయన అన్నారు. ఇండోర్ స్టేడియంలో పనులు పూర్తయినట్లు, ఆఫీస్ రూమ్, లాకర్ రూమ్, టాయిలెట్స్ నిర్మాణాలు పూర్తయినట్లు ఆయన తెలిపారు. అవుట్ డోర్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనులు వేగంగా పూర్తిచేస్తున్న కాంట్రాక్టర్ నాగేశ్వరరావు ను కలెక్టర్ అభినందించారు. వైరా మినీ స్టేడియం అభివద్ధి పనుల్లో వేగం పెంచాలని, త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వైరాలో అవుట్ డోర్లో చేపట్టిన బ్యాడ్మింటిన్ కోర్ట్ పనులను ఆయన పరిశీలించారు. ఇండోర్ షటిల్ కోర్ట్ మిగులు పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. స్టేడియంలో విద్యార్థులను రప్పించి, వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయాలన్నారు. కోచ్ లను అందుబాటులో ఉంచి, మంచి శిక్షణ ఇవ్వాలన్నారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా కల్లూరు ఆర్డీవో సిహెచ్. సూర్యనారాయణ, పీఆర్ ఇఇ లు కెవికె. శ్రీనివాస్, చంద్రమౌళి, జిల్లా క్రీడల అభివద్ధి అధికారి పరంధామ రెడ్డి, తహశీల్దార్లు అరుణ, బాబ్జి ప్రసాద్, వైరా మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓలు శ్రీదేవి, రవికుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.