Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడుభూములకు హక్కుపత్రాలివ్వాలి
- విలేకరుల సమావేశంలో కూనంనేని
నవతెలంగాణ- ఖమ్మం
బీజేపీ చేతిలో దేశంలోని న్యాయ వ్యవస్థ బంధీ అయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని తెలిపారు. శుక్రవారం ఖమ్మంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఊచకోతకు పాల్పడిన వారు సైతం నిర్దోషులుగా బయటకు వస్తున్నారని, న్యాయస్థానాల తీర్పు అనేకప్రశ్నలకు తావిస్తుందని తెలిపారు. గుజరాత్లో 98 మందిని ఊచకోత కోసినా నిర్దోషులుగా విడుదల చేశారని, ఇప్పుడు 11 మంది సజీవ దహనానికి సంబంధించి గుజరాత్ కోర్టు విడుదల చేసిన సందర్భంలో వీరిని ఎవరు చంపారన్న న్యాయవాది ప్రశ్నకు సమాధానం చెప్పలేనిస్థితి నెలకొన్నదన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి పలు నేరాలలో సంబంధమున్న అమిత్షా న్యాయస్థానానికి వచ్చి సాక్షిగా చెప్పడాన్ని తప్పుపట్టారు. బిల్కిన్ భాను కేసులో ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించారని, ఇంతకంటే బీజేపీ న్యాయ వ్యవస్థను ప్రభావితం చేస్తుందనడానికి మరో ఉదహారణ లేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను ప్రభావితం చేస్తున్న బీజేపీని ఓడించకపోతే దేశం భవిష్యత్ ప్రమాదంలో పడుతుందన్నారు. అనేక త్యాగాలతో నిర్మితమైన విశాఖ ఉక్కును కారుచౌకగా కట్టబెట్టాలని నిబంధనలు రూపొందించారని ఆయన ఆరోపించారు. లక్షల కోట్ల విలువ చేసే ఉక్కు కర్మాగారాన్ని కారుచౌకగా కట్టబెడుతున్నారని, అంబానీ, ఆదానీల అనుకూల నిబంధనలు రూపొందిస్తున్నారని, బీజేపీ హయాంలో రాజకీయ అవినీతి పెరిగి పోతుందన్నారు. కొంతమంది డబ్బులతో రాజకీయాలను శాసించాలని ప్రయత్నం చేస్తున్నారని, రూపాయి ఖర్చులేకుండా మీరు ఎక్కడైనా గెలువగలరా అని ప్రశ్నించారు. అసెంబ్లీ గటు తాకనివ్వకపోవడం ఎవరి చేతిలో లేదని, కమ్యూనిస్టులుగా ఖమ్మం జిల్లా నుంచి ఈ దఫా అసెంబ్లీలో అడుగుపెడతామని స్పష్టం చేశారు. ధనబలం కంటే జనబలం ప్రధానమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి వామపక్షాలు త్వరలో ముఖ్యమంత్రికి లేఖ వ్రాయనున్నాయని తెలిపారు. అర్హులైన గిరిజన, గిరజేతరులకు పోడు పట్టాలు, పంచాయతీ కార్యదర్శుల రెగ్యులైజేషన్ సహా పలు సమస్యలపై లేఖ రాస్తామని సకాలంలో పరిష్కరించకపోతే సమస్యల పరిష్కారానికి ఆందోళన చేపడుతామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, రాష్ట్ర సమితిసభ్యులు యర్రాబాబు, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, జిల్లా కార్యవర్గసభ్యులు రావి శివరామకృష్ణ పాల్గొన్నారు.