Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులైన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే
నవతెలంగాణ-కరకగూడెం
ధరణి పోర్టల్ ద్వారా ఎన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపినట్టు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు. శుక్రవారం కరకగూడెం మండల పరిధిలోని రేగళ్ల గ్రామంలో ఏండ్ల తరబడి అసైన్మెంట్ భూముల్లో సేద్యం చేస్తున్న గిరిజనులకు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్‌తో కలిసి పాల్గొన్నారు. అర్హులైన గిరిజనులకు పట్టాలు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చినట్లు ఆయన తెలిపారు. అర్హులైన సుమారు 108 మందికి 360.27 ఎకరాల భూమికి ధరణి పోర్టల్ ద్వారా సమస్య పరిష్కారమయినట్లు ఆయన తెలిపారు. తరతరాలుగా వ్యవసాయాన్ని జీవనాధారం చేసుకుని జీవిస్తున్న నిరుపేద గిరిజనుల సమస్యకు ధరణి పోర్టల్ ద్వారా శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరుతో సేద్యానికి సంవత్సరానికి ఎకరాకు 5 వేలు రైతుబంధు నిధులతో పాటు రైతు భీమా కూడా వర్తిస్తుందని అన్నారు. ధరణి పోర్టల్ ద్వారా పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరుకు కృషి చేసిన కలెక్టర్ అనుదీప్‌ను విప్ రేగా అభినందించారు. సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసిన సీఎం కేసీఆర్‌కి విప్ రేగా కాంతరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ధరణి పోర్టల్ ద్వారా అర్హుల నుండి దరఖాస్తులు స్వీకరించి పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేసినట్లు తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకాలు జారీకి కృషి చేసిన తహశీల్దార్ ఉషా శారదను, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, ప్రభుత్వ అధికారులు, ఎస్ఐ జీవన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.