Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
అశ్వారావుపేట కాంప్లెక్సు సీఆర్పీ సిద్ధాంతపు ప్రభాక రాచార్యులు సంపాదకత్వంలో కాంప్లెక్సు పరిధిలోని విద్యార్ధుల రచనలతో వెలువడుతున్న సృజన కిరణం పుస్తకాన్ని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి ఆవిష్కరించారు. శుక్రవారం స్థానిక జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు సి.హెచ్.నర్సింహారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పిల్లల్లో దాగిన సాహిత్యాభిలాషను వెలికితీసి వారితో రచనలు చేయించడమే గాకుండా వాటిని పుస్తక రూపంలో తీసుకురావడం ఎంతో అభినందనీయమన్నారు. అదేవిధంగా కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు నర్సింహారావు మాట్లాడుతూ బాలల మదిలో అంతులేని సృజన సంపద దాగి ఉందన్నారు. సృజన కిరణం సంపాదకులు ప్రభాకరాచార్యులు మాట్లాడుతూ బాలసాహిత్యం ఇప్పుడు కొత్తపుంతలు తొక్కుతుందని కాంప్లెక్సు స్థాయిలోని ప్రాధమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు ఉన్న విద్యార్ధుల రచనలతో ప్రతి పాఠశాలలో గోడ పత్రికలు క్రమంతప్పకుండా నిర్వహిస్తున్నారని, ఆ గోడ పత్రికలలోని అంశాలే సృజన కిరణంగా మలిచామని అన్నారు. ఈ కార్యక్రమంలో మందపాటి రాజమోహనరెడ్డి, పూర్వ ప్రధానోపాధ్యాయులు పత్తేపరపు రాంబాబు, కాంప్లెక్సు కార్యదర్శి రామినేని రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.