Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాళ్ల వర్షంతో జనం పరేషాన్
- తడిసిన ధాన్యం బస్తాలు
- ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతుల ఉరుకులు, పరుగులు
నవతెలంగాణ-ముదిగొండ
వాతావరణంలో ఆకస్మికంగా మార్పులు చోటుచేసుకుని ఆకాశంలో మబ్బులు పట్టి ఉరుములు, అకాల గాలి దుమారంతో ఐస్ గడ్డల లాంటి రాళ్ల వాన ఆదివారం సాయంత్రం మండలంలోని కురిసి జనాన్ని పరేషాన్ చేసి బీభత్సం సృష్టించింది. అన్నదాతలు ఆందోళనకు గురై పంటలను తడవకుండా పట్టాలకప్పేందుకు కల్లాల్లోకి పరుగులు తీశారు. అప్పటికే ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. మిర్చి, మొక్కజొన్న, ధాన్యం పంటలు కల్లాల్లో ఆరబోసి రాశులుగా ఉంచారు. ముదిగొండ, సువర్ణాపురం, న్యూలక్ష్మీపురం, గోకినేపల్లి, చిరుమర్రి, పమ్మి, కమలాపురం తదితర గ్రామాలలో వానరాళ్లతో వర్షం పడి మొక్కజొన్నను నేలవాల్చి, పంటలను తడిపింది. పలు ఇళ్లల్లో ఉన్న సిమెంట్ రేకులు పగిలిపోయాయి. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు చేతికందే దశలో ప్రకృతి కన్నెర్రకు పంటలు దెబ్బతిని రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. అన్నదాతలకు అకాల గాలి వర్షాలు ఆశనిపాతంలా వచ్చి దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. వేగంగా వీచిన గాలికి మామిడికాయలు రాలిపోయి మామిడి రైతులు పుట్టడ కష్టాల్లో మునిగిపోయారు. గాలి దూమరానికి ముదిగొండ పారిశ్రామిక ప్రాంతంలో ప్రధాన రహదారుకు ఇరువైపులు ఉన్న వృక్షాలు నేలమట్టమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈదురగాలులతో కురిసిన వర్షానికి మొక్కజొన్న నేలవాలి దెబ్బతిన్నది. అకాల గాలివర్షాలకు తడిసి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
తడిసిన ధాన్యం మొక్కజొన్న
నేలకొండపల్లి : ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షం రైతులకు అపార నష్టం కలిగించింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న, మిర్చి వంటి పంటలు తడిసి ముద్దయ్యాయి. ఒక్కసారిగా గాలి దుమారంతో వచ్చిన వడగండ్ల వాన మండలంలో బీభత్సం సృష్టించింది. వర్షం నుండి కల్లాల్లో ఆరబోసిన పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు పరుగులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో వడగండ్ల వానతో ఓ ఇంటి పైకప్పు రేకులు పగిలిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మండల వ్యాప్తంగా అనేక గ్రామాల్లో పంట ఉత్పత్తులు మొత్తం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఆరుగాలం కస్టించి అనేక వ్యయ ప్రయాసల కోర్చి పంటలు పండిస్తే అమ్ముకునే సమయంలో అకాల వర్షం తాకిడితో పంట మొత్తం తడిసిపోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు.
వడగండ్ల వాన రాళ్లు నెత్తిపై పడి రైతుకు గాయం
ముదిగొండ : కమలాపురం పంచాయతీ శివారి అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన కంచర్ల రామచంద్రారెడ్డి అనే రైతు పొలం దగ్గరకు వెళ్ళగా ఆదివారం సాయంత్రం అకాలంగా కురిసిన గాలి, వడగండ్ల వానతోపాటు, రాళ్లు,రైతునెత్తి, చేతిపై పడి గాయాలయ్యాయి. ఇంటికి చేరుకొని ఆరైతు గ్రామంలో ఆర్ఎంపీ దగ్గరికి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. అకాలంగా గాలి, వడగండ్ల వానరాళ్లు వర్షం కురిసి, యాసంగి పంటల నష్టంతో పాటు, ఇండ్లల్లో ఉన్న సిమెంట్ రేకులు పగిలి, మనుషుల మీద పడి గాయాలయ్యాయి.