Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
నిత్య నూతన మార్గదర్శకుడు లెనిన్ అని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ అన్నారు. ఆదివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో 153వ లెనిన్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన చరిత్రను మార్చింది, భవిష్యత్తులో మార్చేది వర్గ పోరాటాలే నని, ప్రస్తుత బీజేపీ పాలనా దుష్ఫలితాలు వర్గ పోరాటాలకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని అన్నారు. దేశంలోని ఈ దోపిడీ వ్యవస్థకు నాయకత్వ స్థానంలో వుంటూ, ప్రభుత్వాలను తమ అదుపాజ్ఞల్లో పెట్టుకొని ప్రజల సంపదను, శ్రమను దోచుకొని లాభపడిన పెద్ద పెట్టుబడిదారులు నేటి ఆధునిక కార్పొరేట్ సంస్థల నగ స్వరూపం బీజేపీ పాలనలో మరింత బట్టబయలవుతుందన్నారు. కొద్దిమంది దగ్గర సంపద ఎలా పోగుపడుతుందో, దానికి రాజ్యం ఎలా తోడ్పడుతుందో అదానీ వ్యవహరం ప్రత్యక్ష సాక్ష్యంగా ఉందనీ, ఏమి చేయలేని స్థితిలో మోడీ ఉన్నాడని విమర్శించారు. దేశ ప్రజలు సృష్టించిన సంపద, ప్రకృతి సహజ వనరులు ఎలా వీరి కబంధ హస్తాల్లోకి పోతున్నాయో కళ్ళ ముందే కనిపిస్తున్నాయను అన్నారు. శ్రమజీవుల హక్కులను కాలరాస్తూ ఆధునిక వెట్టి బానిసలుగా మారుస్తున్న తీరు, వ్యవసాయాన్ని కార్పొరేటైజ్ చేసి గ్రామాల నుండి ప్రజలను తరిమికొడుతున్న విధానాలు, కొందరు ఐ.టి ఉద్యోగుల కృత్రిమ ఆదాయాలు మంచు ముక్కల్లా రోజురోజుకు కరిగిపోతున్న పరిస్థితులు వర్గపోరాటాల అవసరాన్ని పెంచుతున్నాయని తెలిపారు. దేశంలో చిన్న పిల్లల్లో మతోన్మాద విషబీజాలు నాటుతూ, యువతను పెడదారి పట్టిస్తూ, దళితులను, మహిళలను సనాతన సంప్రదాయాల పేరుతో సామాజికంగా అణచివేస్తున్న శక్తులకు వ్యతిరేకంగా పెద్దఎతున కృషి చేయాల్సిన అవసరముందన్నారు. అనేక శక్తులు ఈ కృషిలో భాగస్వాములు కావాలనీ అలాంటివారికి వేదికలు కల్పించడం, వారి భావాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకవెళ్లడం కమ్యూనిస్టుల కర్తవ్యం. అదే లెనిన్‌కు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కత్తి నరసింహ రావు, సైదులు, గిరిబాబు, శ్రీకాంత్, పాషా, తదితరులు పాల్గొన్నారు.