Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30న మోడల్ నీట్ పరీక్షలు
- మోడల్ పరీక్షల కన్వీనర్‌గా ప్రముఖ
విద్యావేత్త, మాజీ శాసన మండలి సభ్యులు చుక్కా రామయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి మోడల్ ఎంసెట్, ఏప్రిల్ 30న మోడల్ నీట్ పరీక్షలు నిర్వహిస్తుందని, మోడల్ పరీక్షల కన్వీనర్‌గా ప్రముఖ విద్యావేత్త, మాజీ శాసన మండలి సభ్యులు చుక్కా రామయ్య వ్యవహరించనున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్ర వీరభద్రం తెలిపారు. ఆదివారం స్థానిక కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని మంచికంటి భవన్లో ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో జరిగే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి మోడల్ ఎంసెట్, ఏప్రిల్ 30న జరిగే మోడల్ నీట్ పరీక్షల గోడ స్టిక్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్ర వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణాలో రాష్ట్ర స్థాయిలో మోడల్ ఎంసెట్, నీట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీలలో నిష్ణాతులైన ఆచార్యుల చేత ప్రశ్నా పత్రాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎఫ్ఐ నిర్వహించే మోడల్ పరీక్షలకు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు, ఎంసెట్, నీట్ పరీక్షల గూర్చి అవగాహన కల్పించేందుకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంసెట్, నీట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరీక్ష ఆన్లైన్, ఆఫ్‌లైన్ పద్దతిలో నిర్వహిస్తున్నామని, ఎంట్రీ ఫీజు రూ.100గా నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలోని విద్యార్థులు పరీక్ష వ్రాసేందుకు పూర్తి వివరాలకు 9492930835, 8309315251 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్, కొత్తగూడెం డివిజన్ అధ్యక్షులు బోడ అభిమిత్ర, జిల్లా కమిటీ సభ్యులు జమ్మి యశ్వంత్, కొత్తగూడెం టౌన్ కార్యదర్శి మంద నాగకృష్ణ, జిల్లా గర్ల్స్ నాయకురాలు భవ్య తదితరులు పాల్గొన్నారు.