Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ-పాల్వంచ
రాష్ట్రంలో గిరిజన గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. కొత్తగా మంజూరు చేసిన పనులకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు కలెక్టరేట్ నుండి జిల్లా పౌర సంబంధాల అధికారి జారీ చేశారు. అనుమంతించబడిన బీటీ రోడ్ల పనుల పర్యవేక్షణ పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎస్టీ అభివృద్ధి నిధులతో మంజూరైన బీటీ, సీసీ రోడ్ల పనులను వెంటనే ప్రారంభించేందుకు పంచాయతీ రాజ్ విభాగం సన్నద్ధంగా ఉంది. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి అధికారులు రోడ్ల నిర్మాణ పనుల సర్వేలను నిర్వహిస్తున్నారు. ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం పాపకొల్లు నుంచి ఏన్కూర్ మండలం బురధరాఘవాపురం వరకు రూ.9.75 కోట్ల అంచనాతో ప్రభుత్వం మంజూరు చేసిన 13 కిలోమీటర్ల బిటి రోడ్ల పనులు చేపట్టుటకు సర్పంచ్ల సమక్షంలో పంచాయతీ రాజ్ విభాగం అధికారులు సర్వే కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 6 నెలలలో పనులు పూర్తి చేయనున్నారు. వాగులు, వంకలు పైన నిర్మించే పనులు మార్కింగ్ చేస్తున్నారు. మొత్తం 13 కిలోమీర్లులో 10.80 కిలోమీటర్లు పొలాలు, గిరిజన గ్రామాలు మధ్య వుంది. మిగిలిన ఏరియా అటవీ ప్రాంతంలో వుంది. కనెక్టివిటీ లేని ఎస్టీ ఆవాసాలకు కనెక్టివిటీలోకి తెచ్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం పట్ల సర్వత్రా గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ బిటి రోడ్లు అందుబాటులోకి వస్తే గిరిజనులకు రవాణా సౌకర్యాలు మెరుగై విద్యా, వైద్య, నిత్యావసర వస్తువులు తదితర అనేక సౌలభ్యాలు కలిగి ఎన్నో రకాలుగా ప్రయోజనాలు పొందేందుకు వీలుపడుతుంది. ఎస్డీఎఫ్ నిధులతో ఆదివాసీ గిరిజనుల దీర్ఘకాల సమస్య పరిష్కారం అవుతున్నది. అలాగే కాకర్ల పిఆర్ రోడ్డు నుంచి రూ.42 లక్షల వ్యయంతో వేయనున్న సీసీ రోడ్డు పనులను కూడా త్వరలోనే చేపట్టనున్నారు. ఈ నిర్మాణ పనులను రెగ్యులర్గా మానిటరింగ్ చేయనున్నట్లు డిపిఆర్ఈ సుధాకర్, డీఈఈ వి.సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు.