Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నష్టపరిహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి
- జిల్లా కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ వైస్ చైర్మెన్ కొత్వాల
- పరిశీలించిన తహసీల్దార్, వ్యవసాయ అధికారులు
నవతెలంగాణ-పాల్వంచ
ఆరుగాలం కష్టపడి చేతికందే సమయంలో పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంటలో రాజారావు అనే రైతు భూమిలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని 30 ఎకరాలు మొక్కజొన్న పంట దగ్ధమైంది. పంట మీదుగా 11 కెవి ఎస్టి లైన్ కలిగి ఉంది. కానీ ప్రమాదవశాత్తు జరిగిందా, ఎవరైనా కావాలనే తగలపెట్టారా అనే విషయం తెలియడం లేదు. పంట కాలడంతో రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. శనివారం ఎర్రగుంటలో దగ్ధమైన పంటను ఆదివారం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆదేశాలతో జిల్లా కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ వైస్ చైర్మెన్ కొత్వాల శ్రీనివాసరావు, తహసీల్దార్ రంగా ప్రసాద్, విద్యుత్ ఏఈ మదుబాబు, వ్యవసాయ శాఖ ఏఏఓలతో కలిసి కొత్వాల పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ.... ప్రభుత్వ అధికారులు సర్వే చేసి, నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సుమారు 50 ఎకరాల్లో రైతులు పండించిన పంట దగ్ధమైందని సుమారు రూ.25 లక్షల పైగా నష్టం వాటిల్లిందని అన్నారు. చేతికందిన పంట కాలిపోవడంతో రైతులు బెంబేలెత్తి పోయారన్నారు. ఎమ్మెల్యే వనమా ఆదేశాలతో స్పందించిన ప్రభుత్వ అధికారులు యుద్ధ ప్రాతిపదికన నష్టం అంచనా వేసి ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి నివేదిక పంపించాలని కొత్వాల అన్నారు. విద్యుత్ అధికారులు వెంటనే విద్యుత్ మరమ్మతులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సోయం బిక్షమయ్య, లైన్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, రైతులు ఎర్రగుంట సాంబశివరావు, నాగభూషణం, మండల సత్యనారాయణ, మేకా శ్రీనివాస్, రత్నాజీ, బాధిత రైతులు నాయకులు నవభారత్ ఆనంద్, మాలోత్ కోటి, సంజరు నగర్ కమలాకర్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మహిళలు పాల్గొన్నారు.