Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధ్వంసం అయిన ఇల్లు
- నేల పాలైన పంట
- నిలిచిన బొగ్గు ఉత్పత్తి
- అంధకారంలో ఏజెన్సీ
నవతెలంగాణ-మణుగూరు
గత రెండు రోజులుగా మణుగూరు సబ్ డివిజన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్ర, శనివారాలలో గాలి దుమారాలతో కూడిన భారీ వర్షం కురవడంతో ఇండ్ల రేకులు గాలికి లేచిపోయాయి. పగిడేరులో ఉప సర్పంచ్ దామల్ల దయాకర్, గొల్ల కొత్తూరులోని మోహిన్ పాషా ఇల్లు ధ్వంసం అయినాయి. అర్ధరాత్రి ఇల్లు పైకప్పు లేచిపోవడంతో ప్రజలు ఇబ్బంది గురయ్యారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ బొమ్మ సెంటర్లో గడదేశి శంకర్ ఇంటిపై రాత్రి వీచిన భీకర గాలుల కారణంగా వేప చెట్టు విరిగి రేకుల షెడ్డు పై పడింది రేకులు ధ్వంసమయ్యాయి. శుక్రవారం దమ్మక్కపేట గ్రామం పంచాయతీలో చిక్కుడు గుంట గ్రామంలో మాటూరి రామచంద్రరావు ఇంటిపై కరెంటు వైర్లు తెగిపోవడంతో కాలి బూడిదయింది. మండలంలో గాలి దుమారం వలన చేతికి వచ్చిన వరి పంట నేల పాలయింది. మండలంలో సుమారు 300 ఎకరాలలో వరి పైరు గాలి దుమారం వర్షంతో నేలకొరిగింది. దీని కారణంగా రైతులు కన్నీరు మున్నీరై బాధపడుతున్నారు. కల్లాలలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. గాలి దుమారం కారణంగా భారీ వక్షాలు విరిగి రోడ్డుకి అడ్డంగా పడ్డాయి. శనివారం రాత్రి నుండి ఆదివాసి గ్రామాలలో విద్యుత్తు పూర్తిగా నిలిచిపోయింది. వర్షం కారణంగా సింగరేణి ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. రోజుకు మూడు వేల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సిన మణుగూరు సింగరేణి యాజమాన్యం గత రెండు రోజులుగా బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని సింగరేణి అధికారులు తెలిపారు.
అకాల వర్షం అన్నదాత...అతలాకుతలం
చర్ల : వాతావరణంలో ఏర్పడిన పెను మార్పులతో భద్రాచలం నియోజకవర్గంలో శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షం తెల్లవారుజామున కురవడం వల్ల కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం మిర్చి తడిసి ముద్దయ్యాయి. మార్చి, ఏప్రిల్ నెలలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మిర్చి కళలలోకి వర్షపు నీరు చేరి మిరపకాయలు తడిసి ముద్ద అవుతున్నాయి. దీనివల్ల మిర్చి రంగు మారి నాణ్యత కోల్పోతుంది. ఈ కారణం వల్ల బహిరంగ మార్కెట్లో రంగు మార్చిన మిర్చి పెద్దగా రేటు పలకదని రైతులు వాపోతున్నారు. రబి సీజన్లో సాగు చేసిన వరి పంటను కోసి ధాన్యం కళ్ళలో ఆర పెట్టారు. అకాల వర్షం కారణంగా కల్లాలలో ఆరబెట్టిన ధాన్యం కూడా తడిసి ముద్దైంది. రెండు నెలల్లో వచ్చిన అకాల వర్షాల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
నేలకొరిగిన భారీ వృక్షాలు, పడి పోయిన విద్యుత్ స్థంబాలు
దుమ్ముగూడెం : మండలంలో ఆదివారం తెల్లy ారుజామున భయానకంగా గాలి వాన దుమారంతో భీభత్సం సృష్టించింది. మెరుపులు, ఉరుములతో వచ్చిన గాలి వానకు మండల ప్రజలు భయ భ్రాంతులకు గురయ్యారు. గాలి దుమారానికి పలు చోట్ల భారీ వృక్షాలతో పాటు విద్యుత్ స్థంబాలు నేల కొరిగాయి. ఈ ఏడాది యాసంగి సాగు చేసిన రైతు లు సైతం తలలు పట్టుకుంటున్నారు. మండల వ్యా ప్తంగా ఆదివారం తెల్లవారుజామున ఇంటి పై కప్పులు లేచి పోయే విదంగా గాలి వాన భీభత్సం సృష్టించింది. గాలి వానతో పలు చోట్ల ప్రదాన రహ దారుల వెంబడి ఉన్న భారీ వృక్షాలతో పాటు దుమ్ము గూడెం గ్రామంలో విద్యుత్ స్థంభాలు నేలకు ఒరిగా యి. సీతానగరం గ్రామంలోని ముక్కెర శ్రీను ఇంటి సమీపంలో ఉన్న భారీ వృక్షం గాలి దుమా రానికి ఇంటి పై పడి పోతుందేమోనని రాత్రి నిద్ర లేకుండా జాగారం చేసినట్లు నవతెలంగాణకు తెలిపాడు.
గ్రామ పంచాయతీలో గౌరవరం గ్రామానికి చెందిన శీలం రాజేష్‌కు సంబంధించిన మూడు ఆవులు, శీలం కన్నయ్యకు సంబంధించిన ఒక ఆవు, సున్నం సమ్మయ్య సంబంధించిన ఒక ఆవు, తాటి గంగరాజు సంబంధించిన ఒక ఆవు మొత్తం ఆరు ఆవులు మరణించడం జరిగింది. ఇవి ఉదయం కురిసిన వర్షానికి పిడుగు పడి చనిపోయాయా లేక మరేదైనా కారణమా తెలియదు కానీ సమీప అడవి ప్రాంతంలో చనిపోయి ఉన్నాయి.
తలలు పట్టుకుంటున్న యాసంగి రైతులు : ఈ ఏడాది యాసంగి సాగు చేసిన రైతులు ఆకాల వర్షాలకు, గాలి వాన భీభత్సానికి తలలు పట్టుకుంటున్నారు. వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో గాలా వానతో వరి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, కోతలకు సిద్దంగా ఉన్న వరి నేల వాలడంతో పాటు తీవ్రంగా నష్టం పోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు మిర్చి రైతులు సైతం గాలి వానకు తీవ్రంగా నష్ట పోయామని వాపోతున్నారు. ఈ ఏడాది సాగులో లాభాలు వస్తాయని ఆశించిన మండల రైతులకు నిరాశ మిగిలింది అనే చెప్పవచ్చు.
మామిడి రైతులకు తీరని నష్టం
టేకులపల్లి : మండలంలోని పలు గ్రామాలలో కురుస్తున్న అకాల వర్షాలు, వీచిన గాలి దుమ్ముతో మామిడి పంట నేలపై పడిపోవడంతో రైతులకు తీరని నష్టం జరుగుతుందని ఆదివారం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గంగారం, సంపత్ నగర్, చింతోనిచిలక, మేళమడగు తదితర గ్రామాలలో వీచిన గాలితో మామిడికాయలు కింద పడి పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. రైతులను ప్రభుత్వము గుర్తించి నష్టపరిహారం చెల్లించి, ఖరీఫ్ సీజన్లో సబ్సిడీ పద్ధతిలో అన్ని రకాల విత్తనాలు రైతులకు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఉమ్మడి మండలంలో వడగండ్లతో వర్షం
ఆళ్ళపల్లి/గుండాల : అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర చేసింది. దాంతో గత రెండు రోజులుగా రాత్రి సమయాల్లో ఆళ్ళపల్లి, గుండాల మండలాల్లో ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో ఉమ్మడి మండలంలోని రైతులకు భారీ నష్టం జరిగింది. శుక్రవారం రాత్రి భారీగా వీచీన ఈదురు గాలులకు మామకన్ను గ్రామం ఆళ్ళపల్లి నడుమ అడవిలో చెట్టు విరిగి విద్యుత్ స్తంభాలపై పడడంతో ఐదు స్తంభాలు విరిగిపడ్డాయి. దాంతో ఆళ్ళపల్లి మండలంలో రాత్రంతా అంధకారం నెలకొంది. శనివారం ఉదయం స్థానిక విద్యుత్ శాఖ ఏఈ రమేష్ బాబు తమ సిబ్బందితో వెంటనే మరమ్మతు పనులు చేపట్టడంతో సమస్య పరిష్కారం అయ్యింది. రంజాన్ పండుగ రోజు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆళ్ళపల్లి, మర్కోడు గ్రామంలో పలువురు ముస్లింలు నిరాశ పడ్డారు. అలాగే శనివారం రాత్రి భారీగా వీచిన ఈదురు గాలులకు మండల పరిధిలోని పలు గ్రామాల్లో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. మిర్చి, మొక్కజొన్న పంటలు దెబ్బతినడంతో రైతులు చాలా నష్టపోయారు. ఓ ఇంటి రేకులు లేచి పడ్డాయి. అలాగే గుండాల మండల పరిధిలోని కన్నాయిగూడెం గ్రామం కృష్ణ అనే రైతుకు చెందిన పాడిపశువు శనివారం రాత్రి పిడుగుపాటుకు గురై మృతి చెందింది. అలాగే ఉమ్మడి మండలంలో కిన్నెరసాని, జల్లేరు, ఏడుమెలకలవాగు, కోడెల తదితర వాగులలో వరదనీరు మోస్తరుగా పారింది. రెండు మండలాల్లో అధికారులు ధ్వంసమైన పంటలను పరిశీలించి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
అకాల వర్షం...అన్నదాత ఆగమాగం
కరకగూడెం : మండలంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వచ్చి పడ్డ గాలి, వర్షం తీవ్ర బీభత్సాన్ని సృష్టించింది. అనుకోని వానతో రైతులు ఆగమాగమయ్యారు. మండలంలో కొన్ని చోట్ల వారి పంట నేలవాలగా, కొన్ని చోట్ల కల్లాల్లోని మిర్చి తడిసి ముదాయింది. సొసైటీ, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం భారీ వర్షానికి తడిసి ముద్ద అయ్యాయి అని రైతులు వాపోయారు. దుమ్ము, దూళితో కూడిన గాలి వానకు పలు గ్రామాల్లో పూరి గుడిసెలు, రేకుల ఇళ్లు నేలమట్టమయ్యాయి. పలు గ్రామాల్లో విద్యుత్ స్థంభాలు విరిగిపడడంతో తీగలు తెగి విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులపై ఇరువైపులా భారీ వృక్షాలు, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.