Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లాడలో 16 షెడ్లు ఏర్పాట్లు
- అనుమతులు లేకుండా నిర్వహణ
- యథేచ్ఛగా కార్బైడ్ వినియోగం
- రైతుకు దక్కని గిట్టుబాటు ధర
నవతెలంగాణ-తల్లాడ
మండలంలో 16 మామిడికాయ మార్కెట్లు యథేచ్ఛగా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. రైతుల నుండి మామిడి కాయ చౌకగా ఖరీదు చేసి పది శాతం సూట్ అంటూ తరుగుతీస్తూ రైతులను మోసపుచ్చుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. దళారుల దోపిడీతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవల కురిసిన వడగళ్ల వాన, తుఫానుకు కాయలు రాలి మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు 7 నుండి 8 టన్నులు రావాల్సి ఉండగా 50 శాతం రాలిపోయి రైతులకు నష్టం వాటిల్లింది. 8 నుండి 9 సార్లు మామిడికి క్రిమిసంహారక మందులు పిచికారి చేయాల్సి వస్తుంది. పెట్టుబడులు పెరిగాయని దిగుబడులు తగ్గటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విపరీతంగా తగ్గిన ధరలు
మార్చి 5 నుండి 80 వేల రూపాయలు పలికిన మామిడి ధర ప్రస్తుతం 35 వేలకు పడిపోయింది. మంగు వచ్చిన కాయలు 7, 8 వేలకే టన్ను విక్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దళారులు స్థానికంగా షెడ్లు ఏర్పాటు చేసి రైతుల నుండి తక్కువ ధరకు మామిడి ఖరీదు చేసి ప్యాకింగ్ చేసి ఢిల్లీ, గుజరాత్, భోపాల్, జైపూర్, ఆగ్రా, రాయపూర్, బంగ్లాదేశ్, కాశ్మీర్ లకు తల్లాడ మండలం నుండి ఎగుమతులు చేస్తున్నారు. ప్యాకింగ్ చేసే ట్రైలల్లో కార్బైడ్ పొట్లాలు పెట్టి ప్యాకింగ్ చేయడంతో లారీలలో రంగు వచ్చి పండిన కాయలలా కనిపిస్తాయి. కాయలు కోసి తింటూ ఉంటే పుల్లగా అనిపిస్తుంది. ఈ కాయలు తిన్నవారికి అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కార్బైడ్ వాడకం నిషేధించిన యథేచ్ఛగా వాడుతున్నారు. వినియోగదారులు తీవ్రంగా అనారోగ్యం పాలవుతున్నారు. రైతులు తాము తెచ్చిన ఉత్పత్తులను మార్కెట్లో సూచించిన మేరకు అమ్ముకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. దీంతో దళారులు బాగుపడుతున్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడులు రాక రైతులు నష్టాల్లో మునిగిపోతున్నారు. ఇటు ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేకపోగా రైతులు నష్టపోతున్నారు. జిల్లా కలెక్టర్ మార్కెట్ కమిటీ అధికారులు తరచూ తల్లాడ, కల్లూరు మధ్య ప్రయాణిస్తుంటారు. కానీ ఎవరూ ఈ విషయాలను పట్టించుకోవడంలేదని ఆరోపణలు ఉన్నాయి. రోడ్డు పక్కనే 16 షెడ్లు వేసి అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న మార్కెటింగ్ శాఖ, ఆరోగ్యశాఖ వారు కానీ పట్టించుకోవడంలేదని దీని వెనుక ఎవరు ఉన్నారు, అనేదానిపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 90 రోజుల్లో కోట్ల పాయల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి కార్బైడ్ వాడకాన్ని నిరోధించాలని, రైతులకు గిట్టుబాటు ధర అందేలా తగు చర్యలు తీసుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు.