Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి జాతీయ స్థాయి ఉత్తమ బహుమతి లభిచింది. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అవలంబిస్తున్న పర్యావరణహిత చర్యలకు గుర్తింపుగా జాతీయస్థాయిలో దక్షిణాది రాష్ట్రాల కేటగిరీలో మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అత్యంత పొదుపుగా నీటిని వినియోగిస్తున్నందుకు ముంబాయికి చెందిన ప్రముఖ మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ సంస్థ వారు ఈ అవార్డును న్యూ ఢిల్లీలో బుధవారం నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో, సంస్థ అధ్యక్షులు ఎస్.దాల్వి థర్మల్ విద్యుత్ కేంద్రం ఏజీఎం కె.ఎస్.ఎన్.ప్రసాద్‌కు అందజేశారు. సాధారణంగా 500 మెగావాట్లు అంతకు ఎక్కువ స్థాయి గల థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఒక మోగావాట్ విద్యుత్ ఉత్పాదనకు 3 క్యూబిక్ మీటర్ల వరకు నీటిని వినియోగించవచ్చని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యూలేటరీ కమిషన్ వారి నిబంధనలు ఉన్నాయి. కాగా, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో గల ప్రత్యేక ఏర్పాట్లు, చర్యల కారణంగా ఈ నీటి వినియోగం 2.69 క్యూబిక్ మీటర్ల వరకు మాత్రమే ఉంటోంది. న్యూ ఢిల్లీలో జరిగిన మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ వారు ఈ ప్రత్యేకతను గుర్తిస్తూ దక్షిణ భారతదేశంలో గల 500 మెగావాట్లు అంతకు మించిన థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అత్యంత పొదుపుగా నీటిని వాడుతున్న సంస్థగా ఎన్టీపీసీ గుర్తించి అవార్డును ప్రకటించారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఇదే విభాగంలో గత రెండు సంవత్సరాలకు ఉత్తమ అవార్డును స్వీకరించడం విశేషం.