Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వింటాల్ మిర్చిపై రూ.200 కోత
- అమాయక రైతులే లక్ష్యంగా దోపిడీ
- హైరేట్పై రూ.4వేలకు పైగా తగ్గింపు
- ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తీరు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారుల దోపిడీ కొనసాగుతోంది. నిత్యం ఏదో ఒకరకంగా రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. అకాల వర్షాలను సాకుగా చూపి సరుకులో తేమశాతం పెరిగిందనే పేరుతో ధరలను భారీగా తగ్గిస్తున్నారు. అది చాలదన్నట్లు క్వింటాల్ మిర్చిపై రూ.200 తేమ పేరుతో కోత పెడుతున్నారు. ఇదేమని రైతులు ప్రశ్నిస్తే 'ఇష్టమైతేనే అమ్ము...లేదంటే పో' అంటూ కస్సుబుస్సుమంటున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. అమాయకంగా కనిపిస్తే చాలు ఎన్ని రకాల కొర్రీలు పెట్టాలో అన్ని విధాలా పెడుతున్నారని, ముఖ్యంగా గిరిజన రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారనే చర్చ సాగుతోంది. బుధవారం 'నవతెలంగాణ' ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లను పరిశీలిస్తుండగానే ఓ ఖరీదుదారి గుమస్తా రైతులతో ఇదే విషయమై వాగ్వాదం చేస్తూ కనిపించాడు. ప్రశ్నిస్తే వ్యాపారులందరూ ఇలాగే కొనుగోలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అత్యవసరమైన రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో అమ్ముకుని వెళ్లారు. మీడియాకు ఈ విషయాలు లీక్ చేస్తే కొనుగోలు చేయమని... హెచ్చరిస్తున్నట్లు బాధిత రైతులు తెలిపారు.
- ధర విషయంలోనూ పేచీ...
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం 34,690 బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది. జెండా పాట రూ.23,050 గరిష్ట ధరగా నిర్ధారించారు. నమూనా ధర రూ.21,000, కనిష్టం రూ.18,000లుగా నిర్ధారించారు. సరుకు ఏమాత్రం తడవకపోయినా...ఎంత బాగున్నా...ఒక్కలాట్ మాత్రమే గరిష్ట ధర పెట్టి అధిక మొత్తం సరుకును రూ.18వేల నుంచి రూ.19వేల మధ్యే కొనుగోలు చేశారు. ఓవైపు కమీషన్ రూ.3.50 నుంచి రూ.8 వరకు తీసుకుంటూ...మరోవైపు ధర, నాణ్యత, తేమ...ఇలా రకరకాల కొర్రీలు పెడుతున్నా గత్యంతరం లేక తెగనమ్ముకుంటున్నామని రైతులు వాపోతున్నారు. కొందరు తెలివైన రైతులు సరైన ధర పెట్టుకుంటే కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేసుకుం టామనడం, మరికొందరు మీడియాకు సమాచారం ఇస్తామ నడం, కొందరు పరపతిని ఉపయోగిం చుకొని ఆశిం చిన ధరకు సమీప రేటు పెట్టించుకుం టున్నారు. కానీ ఇవేవీ తెలియని అమాయక రైతులను మాత్రం వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. గడిచిన వారం రోజుల్లో బుధవారమే అధిక ధర పలికినా తేమ కోల్పోతే తూకం తగ్గుతుందని పేచీ పెట్టి రేటుతో పాటు క్వింటాల్‌కు రూ.200 కోతపెట్టారు.
కాయ మెత్తగుందని క్వింటాల్‌కు రూ.200 కోత పెట్టారు
- వెంకట్రావ్, పంతులునాయక్ తండా, కారేపల్లి మండలం
ఒక్క కాయకూడా తడవలేదు. షెడ్డు కింద పట్టాలు కప్పి పెట్టినం.. ఒక్క బస్తా తడిచేందేమో చూపియ్యమంటే చూపియ్యట్లేదు. సరుకు మెత్తగుంది...డ్రై అయితే తూకం తగ్గుదంటున్నరు. ఇష్టమైతే అమ్ము...లేకుంటే లేదని సేటు వెళ్లిపోయిండు. తర్వాత గుమస్తా వచ్చి క్వింటాకు రూ.19వేలు, ఒక్కో క్వింటా మీద రూ.200 తగ్గించమని మార్కెట్లో సేట్లు చెప్పిండ్రు. ఈరోజు అందరూ ఇలానే అమ్ముతున్నరు. నీకు ఇష్టమైతే ఇవ్వు...లేకుంటే లేదంటే..ఇంటికి పోతే అప్పులోళ్ల పీకులాట తట్టుకోలేనని తెచ్చిన నాలుగు క్వింటాల్లో క్వింటా రూ.18,800 చొప్పున ఇచ్చిపోతున్నా.
కోత పెట్టడానికి వీల్లేదు
- రుద్రాక్షల మల్లేశం, మార్కెట్ సెక్రటరీ
ముందు ఒకటి, రెండు బస్తాలు కోసి శాంపిల్ చూస్తారు. సరుకంతా అదే రీతిలో ఉంటే అంతటికీ ఒకే ధర పెడతారు. కాంట్రాలు వేసేటప్పుడు మరోసారి చెక్ చేస్తారు. అప్పుడు ఏమైనా నాణ్యతాపరమైన లోపాలు కనిపిస్తే రైతు అంగీకారం మేరకే ధర తగ్గిస్తారు. నేను, చైర్మన్ శ్వేత గారు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రోజు ఉదయం గంటపాటు మార్కెట్లోనే తిరుగుతున్నాం. లాట్లాట్ తిరిగి చూస్తున్నాం. రైతుల నుంచి కంప్లైంట్లు వస్తే పరిష్కరిస్తున్నాం. మార్కెట్లో మొత్తం 125 మంది ట్రేడర్లు ఉన్నారు. ఒకరు కాకపోతే ఇంకొకరికి అమ్ముకోవచ్చు. ఏదైనా సరే రైతు అంగీకారం లేకుండా కోత పెట్టడానికి వీల్లేదు.