Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ విద్యావేత్త ఐవి.రమణారావు
నవతెలంగాణ-ఖమ్మం
భారతదేశంలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక పోరాటాలకు సైద్ధాంతిక అవగాహన కల్పించటంలో ఆంటోనియో గ్రాంసీ మార్గదర్శకుడుగా నిలబడ్డాడని ప్రముఖ విద్యావేత్త ఐ.వి.రమణారావు అన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో సిపిఎం జిల్లా కమిటి సభ్యుడు బండారు రమేష్ అధ్యక్షతన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ఆంటోనియో గ్రాంసీ వర్థంతి సభ జరిగింది. ఆ సభలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో గత కొంతకాలంగా ఫాసిస్టు ధోరణులు బలంగా ముందుకు వస్తున్నాయని, ఇవి దేశానికి చాలా ప్రమాదకరమని అన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వివిధ సమూహాల వ్యక్తులను, సంస్థలను తీవ్రంగా అణచివేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించటం ఒక నేరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని హెచ్చరించారు. దేశంలో ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని, కానీ నేడు ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తుందని తెలిపారు. మెజార్టీ, మైనార్టీ వాదాల పేరుమీద ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తున్నారని అన్నారు. ఇది దేశ లౌకిక వాదానికి విఘాతంగా మారుతుందని అన్నారు. మరోవైపు ప్రభుత్వం దేశ సంపదను, వనరులను కార్పొరేట్స్ చేతుల్లో పెట్టారని తెలిపారు. ఇప్పటికే సుమారు 10 లక్షల కోట్ల రూ.లకు పైగా కార్పొరేట్ రుణాలను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసిందని అన్నారు. ప్రభుత్వం ఒకవైపు మతోన్మాద అజెండాను, మరోవైపు కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేస్తుందని తెలిపారు. ఈ విధానాలను వ్యతిరేకించే ఎవరైనా ప్రయత్నిస్తే ప్రభుత్వం ఫాసిస్టు తరహా దాడులతో వారిని అణచివేస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలంతా గ్రాంసీ ఆలోచనతో ప్రజా పోరాటాల్లో భాగస్వాములు కావాలని ఆర్థిక, సామాజిక, సాంస్కతిక పోరాటాలతో ఫాసిస్టు శక్తులను ఓడిరచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటి సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేష్, వై.విక్రం, జిల్లా కమిటి సభ్యులు యర్రా శ్రీనివాసరావు, ఆర్.ప్రకాష్, నాయకులు ఎస్.కె.అఫ్జల్, రఫి, జె.నాగేశ్వరరావు, మల్లెంపాటి వీరభద్రరావు, శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.