Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రజెండా ఎగురవేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ - ఎర్రుపాలెం
పొత్తులో భాగంగా మధిర నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థి పోటీ చేయడం ఖాయమని, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ను నియోజకవర్గ ఇన్చార్జిగా రాష్ట్ర కమిటీ ప్రకటించటం జరిగిందని పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు సూచించారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం రామిశెట్టి పుల్లయ్య భవనంలో గామాసు జోగయ్య అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం దుర్మార్గమైన పాలన చేస్తుందన్నారు. దేశంలో ముస్లిం, క్రిస్టియన్, కమ్యూనిస్టులు ఉండకూడదని దాడులు చేస్తున్నారని విమర్శించారు. అటువంటి ప్రమాదకరమైన బిజెపిని రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం కోసం బిఆర్ఎస్ పార్టీతో ఒప్పందం ఉంటుందని అన్నారు. ఆనాడు బిజెపికి అనుకూలంగా టిఆర్ఎస్ పార్టీ ఉండటంతో వ్యతిరేకించామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు. పోడు భూముల విషయంలో పోరాటం ఆగదని అన్నారు. అకాల వర్షాల వలన మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయని రైతులు బాగా నష్ట పోయారని, నష్టపరిహారం కోసం సిపిఎం పోరాటం చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 9 నియోజకవర్గాలలో సిపిఎం పోటీ చేస్తుందని తెలిపారు.అందులో భాగంగా మధిర నియోజక వర్గంలో సిపిఎం అభ్యర్థి తప్పక పోటీలో ఉంటారని తెలిపారు. మధిర నియోజకవర్గంలో మరొకసారి సిపిఎం జెండాను ఎగుర వేద్దామని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య, సిఐటియు మండల కార్యదర్శి సగ్గుర్తి సంజీవరావు, మండల కమిటీ సభ్యులు నల్లమోతు హనుమంతరావు, షేక్ లాల, బేతి శ్రీనివాసరావు, నాగలవంచ వెంకటరామయ్య, మేడగాని తిరుపతిరావు, ఆంగోతు వెంకటేశ్వర్లు, షేక్ నాగుల్ మీరా రామిశెట్టి సురేష్, దివ్యల వీరాంజనేయులు, అనుమోలు వెంకటేశ్వరరావు, గౌర్రాజు రాములు, బుర్రి రవికుమార్, మాదల వెంకట నరసయ్య, కూడలి నాగేశ్వరరావు, లగడపాటి అప్పారావు, గోధుమ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.