Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ, వ్యకాస, ఏఐకేఎస్,ఎస్ఎఫ్ఐ, ఆధ్వర్యంలో నిరసన
- రెజ్లర్లకు న్యాయ పోరాటానికి సంపూర్ణ మద్దతు
నవతెలంగాణ-కొత్తగూడెం
లైంగిక వేధింపుల ఆరోపణల్లోనూ ఎఫ్ఐఆర్ నమోదుచేయకపోవడమేమిటని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరపు కనకయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజె.రమేష్, వ్యకాస జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో సీఐటీయూ, వ్యకాస, రైతు సంఘం, ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రేపాకుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో వారు పాల్గొని మాట్లాడుతూ బిజెపి పార్లమెంటు సభ్యుడు, భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, ఆయనను శిక్షించి అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు అనేక నెలలుగా పోరాడుతున్నారు. ఏప్రిల్ 21న శరణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదుచేయలేదంటూ న్యాయవాది కపిల్ సిబాల్ సర్వోన్నతన్యాయస్థానానికి నివేదించారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై తక్షణం స్పందించాల్సిన పోలీసులు ఈ ఫిర్యాదు విషయంలో తాత్సారం చేస్తున్నారని, బాధితుల్లో ఒక మైనర్ కూడా ఉన్నందున పోక్సో చట్టం కింద తక్షణం స్పందించాల్సిన పోలీసులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని సిబాల్ న్యాయస్థానానికి గుర్తుచేశారు. శుక్రవారంలోగా సమాధానం చెప్పాలంటూ న్యాయస్థానం ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీచేసి, కేసు ఆ రోజుకు వాయిదావేసింది. అంతర్జాతీయ వేదికలమీద భారతదేశ కీర్తిపతాకాన్ని రెపరెపలాడించిన రెజ్లర్లు ఇలా న్యాయంకోసం నెలల తరబడి పోరాడవలసిరావడం దురదృష్టకరమన్నారు. పునియా, ఫోగట్ వంటివారు పారిస్ ఒలింపిక్స్ శిక్షణను కూడా పక్కనబెట్టి ఈ అంశంపై ఉద్యమిస్తుంటే, క్రీడల్లో మహిళల భద్రతకు, ఉన్నతికి పాటుపడాల్సిన పాలకులు ఓట్ల లెక్కలు చూసుకుంటున్నారని దుయ్యబట్టారు. అంతర్జాతీయ వేదికలమీద భారత్ తలెత్తుకొనేలా చేసినవారు ఇలా న్యాయం కోసం వీధినపడి, కేసుపెట్టమని పోలీసులకు చెప్పాలంటూ న్యాయస్థానం తలుపులు తట్టాల్సిరావడం దేశం యావత్తూ తలదించుకొనే విషయమని అన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్, డి.వీరన్న, కొట్టె నవీన్, తాళ్ళపల్లి కృష్ణ, బాలకృష్ణ, రాములు, తదితరులు పాల్గొన్నారు.