Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐకాస రాష్ట్ర చైర్మన్ నాయికోటి రాజు
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
జూన్‌లోపు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ప్రకటించి, తమ సమస్యలు పరిష్కరించకపోతే జూన్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపడతామని రేషన్ డీలర్ల ఐకాస రాష్ట్ర చైర్మన్ నాయికోటి రాజు అన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం రేషన్ డీలర్ల సమావేశం మండల పరిధిలోని పెద్దతండా వద్ద గల వంశీకృష్ణ ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయికోటి రాజు మాట్లాడారు. రేషన్ డీలర్లకు కనీస వేతనం రూ.30వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.35 నుంచి రూ.40వేలు చెల్లించాలన్నారు. మూడు నెలల నుంచి కమిషన్ రావడం లేదని, ఐదుగురు మంత్రులతో కూడిన కమిటీకి ఐక్యవేదిక ద్వారా డీలర్ల సమస్యల గురించి విన్నవించినా వారి నుంచి ఎటువంటి స్పందనా లేదన్నారు. రేషన్ దుకాణాల్లో బియ్యం 3, 4 కిలోలు తక్కువగా ఉంటే విజిలెన్స్ అధికారులు ''6''ఏ కేసులు నమోదు చేస్తున్నారని, ప్రతి డీలర్‌కు గోదాం నుంచి 3 నుంచి 4 కిలోలు బియ్యం తక్కువగా వస్తున్నాయని, వాటిని నివారించేందుకు తూకం వేసి పంపించాలన్నారు. రేషన్ డీలర్లకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, రషన్ దుకాణాలను మిని సూపర్ మార్కెట్లుగా గుర్తించి మరిన్ని నిత్యావసర సరుకులు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అన్ని రేషన్ దుకాణాలకు 1వ తేదీన నెలవారి సరుకులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.ఉన్నత విద్యావంతులు అయిన వారికి శాఖాపరమైన ఉద్యోగోన్నతి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐకాస నాయకులు బత్తుల రమేశ్, దొమ్మాటి రవీందర్, గడ్డం మల్లిఖార్జున్ గౌడ్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బానోత్ వెంకన్న, ప్రధాన కార్యదర్శి షేక్ జానీమియా, నాయకులు దొండ దర్గయ్య, వెంకటేశ్వరరావు, శేఖర్, వెంకట రెడ్డి, శ్రీనివాసరావు, ఇబ్రహీం పాల్గొన్నారు.