Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయంతి కార్యక్రమంలో పాలుడుగు భాస్కర్, నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
మానవ సమాజ పురోగతికి అనన్య సామాన్యమైన కృషి చేసిన గొప్ప మనిషి కారల్‌మార్క్స్ అని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పాలడుగు భాస్కర్, పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఐవి రమణ తెలిపారు. శుక్రవారం కారల్ మార్క్స్ జయంతి ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య భవనంలో నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. పెట్టుబడిదారీ వ్యవస్థ ధగధగ వెలుగుల ముందు అందరూ సాగిలపడుతుంటే... మార్క్స్ మాత్రం పెట్టుబడి పొట్ట విప్పి అందులోని కుళ్ళును, దోచుకున్న రక్తమాంసాలను, దోపిడీ విధానాన్ని, అమానవీయతను, దాన్ని అంతం చేయాల్సిన అవసరాన్ని కార్మిక జనానికి చేప్పేందుకు తన యావజ్జీవితాన్ని త్యాగం చేశాడని కొనియాడారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో అనివార్యంగా వచ్చే ఆర్థిక సంక్షోభాల మూలాలను, వాటిని పరిష్కరించే విధానాన్ని అత్యంత శాస్త్రీయంగా వివరించారని, ప్రపంచమంతా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నదని, అనేకమంది సంక్షోభాన్ని దాని ప్రభావాలను విశ్లేషిస్తున్నారని, కానీ ఆర్థిక సంక్షోభాలు శాశ్వతంగా బయటపడాలంటే కారల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతమే పరిష్కారం అని తెలిపారు . ఇప్పుడు భారత్ దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టేందుకు కారల్ మార్క్స్ చెప్పిన విధంగా ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా బలోపేతం చేయాల్సి ఉంటుంది అని వారు పేర్కొన్నారు. మోడీ విధానాలతో ఈ దేశం ఆర్థికంగా తీవ్ర సంక్షోభాన్ని మరింత పెరుగుతుంది అని, దేశ సంపద అంతా మోడీ బినామీ అదానీకు ఉచితంగా ధారాదత్తం చేశాడు అని విమర్శించారు. రాబోయే కాలంలో మోడీ విధానాలకు ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాల్లోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వై.విక్రమ్, యర్రా శ్రీనివాసురావు, బండారు రమేష్, మెరుగు సత్యనారాయణ, ఎస్ నవీన్ రెడ్డి పాల్గొన్నారు.