Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమ్మినేనికి యువకుల విన్నపం
- పలు కుటుంబాలు సీపీఐ(ఎం)లో చేరిక
నవతెలంగాణ-నేలకొండపల్లి
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు పోటీ చేయాలంటూ మండలంలోని గువ్వలగూడెం గ్రామానికి చెందిన యువత శుక్రవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి విన్నవించారు. గ్రామానికి చెందిన యువత స్వచ్ఛందంగా ఖమ్మంరూరల్ మండలం తెల్దారుపల్లిలోని తమ్మినేని ఇంటికి వెళ్లి సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, దళితులు గిరిజనులు అన్ని వర్గాల ప్రజల సమస్యల పట్ల సమగ్రమైన అవగాహన కలిగిన మీలాంటివారు చట్టసభలలో ఉండడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలిపారు. నేడు చట్టసభలలో కమ్యూనిస్టులు లేకపోవడంతో సమస్యలు పేరుకుపోతున్నాయని కమ్యూనిస్టులు ఉద్యమాలు చేయడం ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నా చట్టసభలలో లేకపోవడం వల్ల మరిన్ని సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయన్నారు. అసెంబ్లీలో నిరుద్యోగ యువత, రైతులు, కార్మికులు, మహిళల తరఫున కొట్లాడేది, పోట్లాడేది కమ్యూనిస్టు ప్రజా ప్రతినిధులే అన్నారు. నేడు చట్టసభలలో వారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు, ఆటుపోట్లు ఎదురైనా మీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామంటూ ప్రతినబూనారు. అనంతరం తమ్మినేని సమక్షంలో సిపిఎంలో చేరారు. ఈ కార్యక్రమంలో గువ్వలగూడెం సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి మారుతి సూర్యనారాయణ, యువకులు భువనగిరి గోపి, గుడిపల్లి నవీన్, నల్లగుండ్ల సందీప్, ఎస్.కె గఫూర్, ఎస్కే నాగుల్ మీరా, మేగడ లింగారావు తదితరులు పాల్గొన్నారు.