Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
ఉపాధిహామీ కూలీల బతుకులతో బిజెపి చెలగాటం ఆడుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తేలప్రోలు రాధాకృష్ణ అన్నారు. మేడే వారోత్సవాల సందర్భంగా మధిర మండల పరిధిలోని ఇల్లూరు, మహాదేవపురం గ్రామాలలో ఉపాధి కూలీల పని ప్రదేశాలలో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వ్యవసాయ కార్మిక జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరువు కాలంలో కూలీల ఆకలి తీరుస్తూ నేడు పేదలకు అండగా ఉన్న ఉపాధిహామీ చట్టాన్ని దూరం చేసే కుట్రను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మాను కోవాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం కూలి డబ్బులు నేటికి రాకపోవడం...ఈ సంవత్సరం నెలరోజులు అయినా డబ్బులు రాకపోవడం రోజువారి అవసరాలు తీరక నిత్యావసర ధరలకు తట్టుకోలేక అప్పులు చేసుకుని ఇబ్బంది పడుతున్నా పరిస్థితి దాపురించిందన్నారు. కూలీల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఎనిమిదో తారీఖున మధిర ఎంపీడీవో ఆఫీస్ ముందు ఆందోళన నిరసన కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమానికి మండల పరిధిలో ఉన్న ఉపాధి కూలీలు అందరూ కదలిరావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వడ్రానపు మధు, శేఖర్ లతా లలిత, అమ్మ కల్పన, ఈశ్వర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.