Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని లక్ష్మీపురం విశాల సహకార పరపతి సంఘం అధ్యక్షుడు మాదినేని వీరభద్రరావు కోరారు. మండల పరిధిలో లక్ష్మీపురం సహకార సంఘం పరిధిలోనే గోవిందాపురం ఎల్ గ్రామంలో లక్ష్మీపురం సోసైటీ చైర్మన్ మాదినేని వీరభద్రరావు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కూడా ఒక మంచి కార్యక్రమం అన్నారు. ఆరు కాలం కష్టపడి పంట పండించిన రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని కోరారు. రైతులను కాపాడాలనే ఉద్దేశంతోనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతులకు క్వింటాకి రూ.1,962 గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాల రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 25 క్వింటాళ్లు మాత్రమే పరిమితి విధించిందని, ఈ పరిమితిని ఎత్తివేసి ఎకరానికి 30 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసే విధంగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ తుళ్లూరు రమేష్, గోవిందాపురం ఎల్ ఉప సర్పంచ్ కారంగుల చంద్రయ్య, సీఈఓ నిమ్మగడ్డ పుల్లారావు, సొసైటీ డైరెక్టర్లు కళ్యాణపు శ్రీనివాసరావు, పత్తి రాధాకృష్ణ, తాత వీరయ్య, పొన్నం అనంతమ్మ, లక్ష్మీపురం సొసైటీ మాజీ సీఈవో ఏడునూతల లక్ష్మణరావు, పోలూరి గాంధీ సొసైటీ సిబ్బంది కొత్తపల్లి రవి, షేక్ మస్తాన్, చేబ్రోలు నాగేశ్వరరావు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.