Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివాసీ సంఘం టీఏజీఎస్ మహాసభలతో భద్రాద్రికి మన్నెం శోభ
- రేలాపండుంతో ఒకచోటికి ఆదివాసి కళారూపాలు
- ఆద్యంతం ఆకట్టుకున్న బహిరంగసభ...ర్యాలీ నృత్యాలు
- ఆదివాసి హక్కుల సంరక్షణకు మహాసభల శంఖారావం
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సంస్కృతిని చాటే కళారూపాలు...
రేలాపండుంలో భాగంగా జూనియర్ కళాశాల మైదానంలో రెండురోజుల పాటు నిర్వహించిన కళారూపాలు అడవి అందాలను అక్కున చేర్చాయి. ఆదివాసి సంస్కృతికి అద్దం పట్టాయి. ఆరు జిల్లాలు ఆదిలాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, కొమురంభీమ్ ఆసిఫాబాద్ నుంచి వచ్చిన మొత్తం 900 మంది ఆదివాసి కళాకారులు తమ నృత్యరూపాలతో అలరించారు. కోయ, గోండు, కొలాం, ప్రధాన్, నాయకపోడు, మన్నెవారు...తమ తెగల సంస్కృతిని చాటే కళారూపాలను ప్రదర్శించారు. ఆదిలాబాద్ అడవులకు చెందిన ఆదివాసి గొండుల సస్సోరు నృత్యం అడవిబిడ్డలు ప్రావీణ్యతకు దర్పణం పట్టింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ నృత్యరూపకంలో శిక్షణ పొంది దీపావళి సందర్భంగా ఏడు రోజుల పాటు ప్రదర్శించే ఈ కళారూపం ఆదివాసి సంస్కృతి, ఆచార వ్యవహారాలను కళ్లకు కట్టినట్టు చూపింది. చక్కటి కళలకు పెట్టని కోటలుగా ఉన్న ఆదివాసి కళలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతిని రూపుమాపి...మొత్తంగా ఆదివాసి అస్థిత్వానికే ముప్పు తెచ్చే చర్యలను బీజేపీని ముందుకు నడిపే ఆర్ఎస్ఎస్ సంస్థ చేపట్టింది. వనవాసి కళ్యాణ్ పరిషత్, ఆదివాసి మోర్చా పేరుతో హిందూత్వ ఎజెండాను అడవుల్లో అమలు చేయాలనే కుట్రపూరిత చర్యలను మహాసభలు ఎండగట్టడంపై ప్రతినిధులు హర్షం వెలిబుచ్చారు.
పోరాట స్ఫూర్తిని చాటుతూ...
టీఏజీఎస్ అస్సలు ఏమి చేస్తుంది? ఆదివాసిలకు ఎలా అండగా నిలబడింది..అనే విషయాలను మహాసభ డెలిగేట్స్ చర్చల సందర్భంగా వివరించారు. ఆదివాసి హక్కుల కోసం టీఏజీఎస్ చూపుతున్న పోరాట స్ఫూర్తిని ఎలుగెత్తిచాటారు. ఆదివాసి సంస్కృతి పరిరక్షణ, స్వయం పాలన, భూమిపై హక్కు, ఉపాధి, అభివృద్ధి, సంక్షేమం, ఆదివాసీల హక్కుల రక్షణకై పోరాడుదాం...అనే నినాదంతో ఈ మహాసభలు సాగాయి. ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకరత్ మార్గనిర్దేశం ప్రతినిధుల్లో పోరాట స్ఫూర్తిని రగిలించింది. మొత్తం ఈ మహాసభలకు 8 ఆదివాసి జిల్లాల నుంచి 270 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఆదిలాబాద్ నుంచి 69, నిర్మల్ 10, ఆసిఫాబాద్ 41, మంచిర్యాల 11, ములుగు 40, భద్రాద్రి 60, ఖమ్మం నుంచి 17 మందికి పైగా హాజరయ్యారు. చివరి రోజు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిడియం బాబురావు జెండావిష్కరణ చేసి కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాల వేయగా..కుంజా బజ్జి చిత్రానికి ఆహ్వానసంఘం అధ్యక్షులు రవివర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమ్రావ్ సున్నం రాజయ్య చిత్రపటానికి పూలమాలలు
వేశారు.
అమరవీరులకు నివాళి అర్పిస్తూ ఆదివాసి కళాకారులు ఆలపించిన గీతం ఆకట్టుకుంది. మహాసభ కూడా సంతాపం తెలిపింది. ఆదిలాబాద్ ప్రతినిధులు ఆదివాసీ పోరాటాలు, కళారూపాలు, దర్శనీయ స్థలాలు, ఆదివాసి ప్రతిభను చిత్రాలతో కూడిన వైజ్ఞానిక ప్రదర్శన ఆలోచింపజేసింది. టీఏజీఎస్ నూతన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మిడియం బాబురావు తిరిగి నియామకం కాగా సచిన్ ప్రధాన కార్యదర్శిగా కొత్తగా ఎన్నికయ్యారు. గతంలో ఈ బాధ్యతల్లో కొనసాగిన భీమ్రావ్ ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. మొత్తమ్మీద ఈ మహాసభలు విజయవంతంగా ముగియడంపై ఆహ్వానసంఘం హర్షం వెలిబుచ్చింది.
'జల్..జంగిల్...జమీన్' హమారా...అంటూ పోరాట యోధుడు కొమురం భీమ్ నినాదం స్ఫూర్తితో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (టీఏజీఎస్) నిర్వహించిన రాష్ట్ర మూడో మహాసభతో నాలుగు రోజుల పాటు భద్రాద్రి పురవీధులు మన్నెం శోభను సంతరించుకున్నాయి. ఆదివాసి బిడ్డలు కదంతొక్కుతూ...పదం పాడుతూ పురవీధులను పులకింపజేశారు. బహిరంగ సభ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన మహాప్రదర్శనతో వీధులన్నీ పచ్చని రంగేసినట్లు కనిపించాయి. ఇక జూనియర్ కళాశాల మైదానంలో 3, 4 తేదీల్లో నిర్వహించిన 'రేలాపండుం' గురించి ఎంత చెప్పినా తక్కువే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆదివాసి కళారూపాలు 'అడవి తల్లికి దండాలో...' అన్నట్లు సాగాయి. జీవో నంబర్ 3 రద్దు, అటవీహక్కుల చట్టం 5వ షెడ్యూల్‌కు విరుద్ధంగా కొనసాగుతున్న చర్యలు, పీసా, 1/70 చట్టాల ఉల్లంఘన తదితరాలపై ఆదివాసీలకు అవగాహన కల్పించడంలో టీఏజీఎస్ మహాసభలు సక్సెస్ అయ్యాయి. ఆదివాసి బిడ్డలు, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఈ మహా సభలకు తరలివచ్చింది. టీఏజీఎస్ ఆధ్వర్యంలో పోరాటాలను ఎలా ముందుకు తీసుకెళ్తుంది వివరించింది. ఆదివాసి హక్కుల పరిరక్షణకు ఈ మహాసభ దిశానిర్దేశం చేసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని ప్రతినిధుల అభిప్రాయం. నూతన కమిటీ ఎన్నిక, 16 తీర్మానాలతో టీఏజీఎస్ రాష్ట్ర మూడో మహాసభలు శనివారం భద్రాద్రిలో ఉత్సాహాపూరిత వాతావరణంలో ముగిశాయి.
పోరాట స్ఫూర్తిని చాటాయి...
బండారు రవికుమార్, టీఏజీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
టీఏజీఎస్ పోరాట స్ఫూర్తిని ఈ మహాసభలు చాటాయి. తునికాకు బోనస్, పోలవరం ముంపుకు వ్యతిరేకంగా పోరాటం, యురేనియం పేరుతో నల్లమల అడవులను గుల్ల చేసే చర్యలన్నింటినీ టీఏజీఎస్ ప్రతిఘటించింది. ఆదివాసిలకు దక్కాల్సిన హక్కులు, ఆర్థిక వనరులు దక్కకపోతే ఎలాంటి ఆందోళనలకైనా సిద్ధం కావాలని నిర్ణయించు కున్నాం. అడవుల్లో హిందుత్వ ఎజెండాను అమలు చేయాలని చూస్తున్న కేంద్రప్రభుత్వానికి ఈ మహాసభలు ఓ హెచ్చరికగా నిలిచాయి.
జల్ సాధించుకున్నాం...
కాత్లే లింబారావు, చాకిరేవు,నిర్మల్ జిల్లా
నేను మూడో తరగతి వరకు చదువుకున్నా. మా గ్రామంలో నీళ్లు లేవు. తాగునీటి కోసం నకనకలాడుతున్నాం. టీఏజీఎస్ సహకారంతో నీళ్ల కోసం పాదయాత్ర చేపట్టా, కలెక్టర్‌ను కలిశాం. జిల్లా కార్యదర్శి తోడసం సంబు నేతృత్వంలో నాలుగురోజులు నడిచి కలెక్టరేట్‌కు చేరుకుని, 8 రోజులు నిరాహార దీక్ష చేపట్టి జల్ సాధించుకున్నాం.