Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
వైరా కమ్మవారి కళ్యాణ మంటపం నిర్మాణానికి 25 లక్షలు విరాళం అందజేసిన కేతినేని వంశీ ధర్ ను కళ్యాణ మండపం కమిటీ శనివారం ఘనంగా సన్మానించింది. మండలంలోని కొండకుడిమ గ్రామానికి చెందిన కేతినేని రామారావు కుమారుడు ప్రవాస భారతీయుడు వంశీ ధర్ అమెరికాలోని వర్జీనియాలో ఉంటూ పలు సంస్థలకు ఆర్థిక చేయూతనిస్తున్నారు. వంశీధర్ గత సంవత్సరం వైరా మండలానికి 108 వాహనం కూడా అందజేశారు. భద్రాచలంలో కమ్మ జన సేవాసమితి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కళ్యాణ మండపానికి కూడా రూ.15 లక్షలు ఇచ్చినట్లు వంశీ ధర్ తెలిపారు. యుఎస్ నుండి స్వదేశానికి వచ్చిన వంశీధర్ను వైరా కమ్మ జన సేవాసమితి ఆహ్వానించి దాతల సహకారంతో నూతన హంగులతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని చూపించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సమితి అధ్యక్షులు చింతనిప్పు వెంకటయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ మధిర మాజీ ఎమ్మెల్యే కొండ బాల కోటేశ్వరరావు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఇటువంటి వసతులు ఏర్పాటు చేసుకోవాలని, అందుకోసం వంశీధర్ లాంటి యువకులు ఉన్నత విద్యావంతులుగా విదేశాలలో స్థిరపడి ఆర్థికంగా నిలదొక్కుకుని సహాయం అందజేసే మనస్తత్వంతో ఉన్నారని, మౌలికంగా విద్యా బోధన కల్పించేందుకు సహాయ పడాలనే లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. జడ్పి ఉన్నత పాఠశాలలో విద్యనేర్పుతూ వారిని ఉన్నతులుగా తీర్చి దిద్దుతున్న విజయవాడ కమ్మ జన సేవా కార్యక్రమాలను కూడా పరిశీలించి ఈ ప్రాంత విద్యార్థులకు అవసరమైన సహాయం అందించాలని కోరారు. సన్మాన గ్రహీత వంశీ ధర్ మాట్లాడుతూ నా సేవా కార్యక్రమాలకు ప్రేరణ, స్ఫూర్తి కొండ బాల కోటేశ్వర రావు కారణమన్నారు. అమెరికా వచ్చిన సందర్భంగా నాతో మాట్లాడుతూ సమాజానికి కొంత సేవ చేయాలని చెప్పిన ఫలితమే 108 అంబులెన్స్, మీ సేవా సమితి విజ్ఞప్తి మేరకు ఆర్థిక సహాయం మాత్రమే చేశానని, ఇంత బాగా ఉంటుందని అనుకోలేదని, ఇది చూసిన తర్వాత దీని వెనక ఎంతో మంది కృషి ఉన్నదని, నాకు సంతృప్తిగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు కట్టా కృష్ణార్జున రావు, దామా వీరయ్య, పొడపాటి నాగేశ్వర రావు, కేతినేని సుబ్బారావు, డాక్టర్ కాపా మురళి కృష్ణ, బిక్కసాని దామోదర్, మెదర మెట్ల శ్రీనివాసరావు, చింత నిప్పు సుధాకర్ రావు, ఏలూరి వెంకటేశ్వర రావు, శ్రీరామనేని భాస్కర్ రావు, కొప్పుల వెంకటేశ్వర రావు, మచ్చా వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.