Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియోజక వర్గం ఎన్నికల అధికారి,జేసీ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-అశ్వారావుపేట
పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పన, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణే ఎన్నికల కమిషన్ లక్ష్యం అని, ఇందుకోసం రాజకీయ పార్టీలు ప్రతినిధులుగా మీరు సూత్రబద్ధమైన సూచనలు, ఆలోచించగా అభిప్రాయాలు ఇవ్వాలని నియోజక వర్గం ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు కోరారు. ఆయన ఎన్నికల కసరత్తు పై శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నియోజక వర్గం స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఎన్నికల్లోనూ 18 ఏండ్లు నిండిన ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ మూడు నెలలకు ఒక సారి ఓటు నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది అని తెలిపారు. ఇకనుండి ప్రతివారం ఎన్నికల నిర్వహణ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఉంటుందని స్పష్టం చేసారు. 1200 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉంటుందని అన్నారు. ఫాం 6,7,8 ప్రకారం దరఖాస్తులు, పెండింగ్, నిరాకరణ, అనుమతులను వివరించారు. ఈ త్రైమాసికంలో నియోజక వర్గంలో 933 దరఖాస్తులకు గాను 740 దరఖాస్తులు ఆమోదించామని, 62 దరఖాస్తులకు అభ్యంతరాలు వచ్చాయి అని, 131 దరఖాస్తులు పలు సాంకేతిక కారణాలతో పెండింగ్లో ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో బీటీ సుచిత్ర, సీపీఐ(ఎం) నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య, అర్జున్, చిరంజీవి, సీపీఐ నుండి సలీం, రామక్రిష్ణ, రఫీ, సత్యవరపు బాలగంగాధర్(కాంగ్రెస్), కట్రం స్వామి దొర, నార్లపాటి శ్రీను(తెదేపా), ఎస్.కే నబీ సాహెబ్ (టి.జె.ఎస్), బండి పుల్లారావు, దొడ్డాకుల రాజేశ్వరరావు(బీఆర్ఎస్), మెట్టుగా వెంకటేష్, బండారు చంద్రశేఖర్(భాజపా)లు పాల్గొన్నారు.