Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలో వరి సాగు చేసే రైతులందరికీ ఏడబ్ల్యుడీ పథకాన్ని వర్తింపజేయాలి
- ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
నవతెలంగాణ-పినపాక
వ్యవసాయ రంగంలో వస్తున్న అధునాతన పద్ధతులను అన్నదాతలు అందిపుచ్చుకోవాలని ఈ దిశగా కృషి చేస్తున్న సీసీ ఎక్స్ సేవలు అభినందనీయమని పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. పినపాక మండలం జానంపేట రైతు వేదికలో సీసీఎక్స్ జిల్లా మేనేజర్, జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అధ్యక్షతన సిసి ఎక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టేక్ హౌల్డర్స్ రైతు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ వరి సాగులో అధికంగా సాగునీరు ఉంచడం వల్ల మిథైల్ విషవాయువు ఉత్పత్తి అయ్యి పర్యావరణానికి పెను ప్రమాదంగా మారిందని ఈ గ్యాస్ ఉత్పత్తిని తగ్గించేందుకు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సీసీ ఎక్స్ సంస్థ వరి సాగులో తడి పొడి పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. రైతులు వరి సాగులో తడి పొడి విధానం అవరంబించడం వల్ల మిథైన్ విష వాయువు ఉత్పత్తి తగ్గించటంతో పాటు భూగర్భ జలాలను పొదుపు చేయడం విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం భూసారాన్ని పరిరక్షించడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న పినపాక, కరక గూడెం మండలాలతో పాటు జిల్లాలోని మిగిలిన మండలాల్లో సైతం ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సిసియక్స్ జిల్లా మేనేజర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి, సిసిఎక్స్ ఉన్నత అధికారులకు ఎమ్మెల్యే రేగా సూచించారు. వ్యవసాయ శాఖ, సీసీ ఎక్స్ అధికారులు కలిసి సంయుక్తంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కార్యక్రమాల్ని అమలు చేయాలన్నారు. రైతులకి సంస్థ ప్రతినిధులకు మధ్య అనుసంధానం ఉండేలా ఆదర్శ రైతులను నియమించాలని ఎమ్మెల్యే రేగా అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలిసారిగా సిసి ఎక్స్ ఏడబ్ల్యుడి ప్రాజెక్టును తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సిసి ఎక్స్ డైరెక్టర్ హెడ్ హృషికేశ్ మహాదేవ్ మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా సాంకేతికంగా అభివృద్ధి చెందెందుకు తమ సిసి ఎక్స్ సంస్థ నడుం బిగించిందన్నారు. అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.కార్తీక్ రావు మాట్లాడుతూ తడి పొడి పద్ధతిలో రెండు పంటలు వరి పండించే రైతులకు ఎకరానికి రూ.800 ప్రోత్సాహక ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. శాస్త్రవేత్త, సిసి ఎక్స్ కన్సల్టెంట్ డాక్టర్ ఎస్ నరసింహారెడ్డి మాట్లాడుతూ తడి పొడి విధానం పై వరి రైతులకు సహజంగా ఉండే సమస్యలు సందేహాలను నివృత్తి చేశారు. తడి పొడి పద్ధతిలో వరి సాగు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పోతన ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్, సిసి ఎక్స్ డైరెక్టర్ గడ్డం వెంకట్ రెడ్డి, హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్ ప్రశాంత్, వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ దేవేందర్, మణుగూరు డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు తాతారావు, ఏఈఓ కేశవ్, పినపాక వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ, జడ్పిటిసి సుభద్ర వాసు, రైతు సమన్వయ సమితి పినపాక మండల కోఆర్డినేటర్ దొడ్డ శ్రీనివాసరెడ్డి, సహకార సంఘం చైర్మన్ ముదునూరి రవిశేకర్ వర్మ, సహకార సంఘం డైరెక్టర్ పొనుగోటి కామేశ్వరరావు, వికాస్ అగ్రి ఫౌండేషన్ వైస్ చైర్మన్ పచ్చి పులుసు నరేష్, సిసిఎక్స్ క్లస్టర్ కోఆర్డినేటర్ పసుపులేటి కార్తీక్, ఫీల్డ్ కోఆర్డినేటర్లు పొనుగోటి సాయి, తేజస్, సంకాపురం శ్రీనివాస్, బాబురావు, మందడపు సాంబశివరావు, సహాయకులు సాయి, మూడు రైతులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రేగాకి ఘన సత్కారం
పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావుని సిసిఎక్స్ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. సిసి ఎక్స్ సంస్థ ప్రతినిధులు హృషి కేశవ్ కార్తీక్ రావు, నరసింహారెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా మేనేజర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి ఎమ్మెల్యే రేగా కాంతారావుకి ధాన్యం కంకులు, వ్యవసాయ రంగానికి చిహ్నమైన కలప నాగలిని బహుకరించి పూల బొకేలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.