Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహకరించిన ప్రజలకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు
- రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మిడియం బాబురావు
నవతెలంగాణ-భద్రాచలం
మే 3 నుండి 6 వరకు జరిగిన తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర 3వ మహాసభలు జయప్రదంగా ముగిశాయని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మిడియం బాబురావు అన్నారు. సహకరించిన ప్రజలకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 3, 4 తేదీలలో జరిగిన ఆదివాసి గిరిజన సాంస్కృతిక ఉత్సవాలు ఆదివాసి గిరిజనుల, సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబింఛాయని అన్నారు. రెండు రోజులపాటు జరిగిన రేలా పండుం ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించడం మంచి పరిణామం అని, ఉత్సవాల్లో పాల్గొన్న ప్రజలకు, ముఖ్య అతిథులుగా పాల్గొన్న పట్టణ ప్రముఖులు, డాక్టర్లు, వ్యాపార వర్గాలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గిరిజన సంఘం కేంద్ర నాయకురాలు బృందా కారత్ పాల్గొన్న బహిరంగ సభ, ర్యాలీ జయప్రదం చేసిన గిరిజన ప్రజలకు అభినందనలు తెలిపారు. మహాసభ జయప్రదం కోసం ఏర్పాటుచేసిన కమిటీలు కృషి అభినందనీయమని అన్నారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలో చర్చించిన గిరిజన సమస్యలపై భద్రాద్రి కేంద్రంగా రానున్న కాలంలో గిరిజన ఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ప్రధానంగా ఆదివాసి గిరిజనుల మనుగడను ప్రమాదంలోకి నెట్టే కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాడుతామని అన్నారు. విద్య, ఉపాధి, గిరిజన చట్టాల అమలు తదితర అంశాలపై మహాసభలో చర్చించి నిర్వహించాల్సిన పోరాటాలపై కార్యాచరణ రూపొందించడం జరిగిందని అన్నారు. గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా హక్కు పత్రాలు ఇవ్వాలని లేకుంటే రానున్న కాలంలో పోడు పోరు తప్పదని అన్నారు. మూడవ మహాసభలో ఎన్నికైన నూతన రాష్ట్ర కమిటీ పటిష్టమైన గిరిజన ఉద్యమాన్ని నిర్మాణాత్మకంగా సాధిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కారం పుల్లయ్య, ఉపాధ్యక్షురాలు సున్నం గంగా, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సోయం జోగారావు, కుంజా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.