Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ఖమ్మం రూరల్
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేయాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి మూదాం శ్రీనివాసరావు అన్నారు. తమని పర్మనెంట్ చేయాలని కోరుతూ తొమ్మిది రోజులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మండలంలోని జలగం నగర్ వద్ద గల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట చేస్తున్న నిరవధిక సమ్మెను ముదాం శ్రీనివాసరావు సందర్శించి ఆదివారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. గత నాలుగు సంవత్సరాలుగా తక్కువ వేతనంతో వెట్టి చాకిరీ చేయించుకున్న కార్యదర్శులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయితీ కార్యదర్శులకు ఇచ్చిన మాట ప్రకారం పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాలు అభివృద్ధి చెందడంలో పంచాయతీ కార్యదర్శుల పనితీరు వెలకట్టలేనిది అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాసారని, ప్రత్యక్షంగా కలిసి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని తెలిపారని ముదాం శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్ళపల్లి మోహన్ రావు, జిల్లా నాయకులు మేడికొండ నాగేశ్వరరావు, దోనోజు పాపయ్య, లక్ష్మయ్య, గూడ బ్రహ్మం, దేవ్జా, ఐతగాని రవి, కన్నెకంటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.