Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీళ్ళు గజ్వేల్ ఫాంహౌస్‌కి
- నిధులు, నియామకాలు కేటీఆర్, కవిత, సంతోష్ రావులకు..
- 8న సరూర్ నగర్లో యువ సంఘర్షణ సభ
- విజయవంతం చేయండి : నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్
నవతెలంగాణ-ఖమ్మం
కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేసి ఉద్యమ నినాదాలన్ని కేసిఆర్ ఇంటికే పరిమితం అయ్యాయని టీపిసిసి సభ్యులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ ఆరోపించారు. ఆదివారం ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం (సంజీవరెడ్డి భవనం)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలు, కొలువులు, నియామకాలు మనకు రాలేదని, మనం ఉద్యమించామని, మన రాష్ట్రం మనకు కావాలని నినదించామని, మా కొలువులు మా రాష్ట్రంలోనే మాకొస్తాయని, మన విద్యార్థి లోకం గొంతెత్తిందని, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయానికి గురవుతున్నామని, గుర్తించిన సోనియమ్మ మన రాష్ట్రం మనకిచ్చిందని గుర్తు చేశారు. సొంత రాష్ట్రం అయితే వచ్చింది కానీ, పాలకులు మాత్రం పరాయివాళ్లయ్యారనీ, సొంత రాష్ట్రంలో తొమ్మిదన్నరేళ్లుగా కొలువులు కోసం నిరుద్యోగులు, విద్యార్థులు, యువత మళ్లీ పోరుబాట బట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో మన ఉద్యోగాల కోసం.. మన బిడ్డలు మళ్లీ తండ్లాటకు దిగడం అత్యంత దురదృష్టకరంమని అన్నారు. కల్లబొల్లిమాటలు, ఉత్తుత్తి హామీలతో అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. నేడు దొరల పాలన చేస్తున్నారని అన్నారు. ఆనాడు రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, తల్లి సోనియమ్మ బిడ్డ ప్రియాంకగాంధీ నేడు మన విద్యార్థులు, నిరుద్యోగుల కోసం మరోసారి జంగ్ సైరన్ మోగించేందకు హైదరాబాద్ నడిబొడ్డుకు వస్తోందని, రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని, కొలువులు వస్తే ఆత్మగౌరవంతో జీవించవచ్చు అని ఆశించి భవిష్యత్ తరాలకు బాటలేసే నిర్ణయాధికారంలో మనమే ఉంటాం అనుకున్నామని అన్నారు. కానీ నోటిఫికేషన్లను.. నిరుద్యోగుల లక్ష్యాలను.. కేసీఆర్ లక్షలకు అమ్ముకుంటుంటే.. తెలంగాణ ఇచ్చిన సొనియమ్మ బిడ్డ.. ప్రియాంకగాంధీ.. నిరుద్యోగుల పక్షాన ఉద్యమ భేరీ మోగిస్తోందని తెలిపారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో నీళ్లు రావు నిధులు లేవు.. నియామకాలు ఊసే లేదు అన్నట్లుగా ఉందని , నీళ్లు గజ్వేల్ ఫామ్ హౌస్ కు.. నిధులు కేటీఆర్, హరీష్, కవిత, సంతోష్ రావుకు.. నియామకాలు మొత్తం కుటుంబానికి మాత్రమే చెందాయని విమర్శించారు. రండి కదలిరండి.. చేయిచేయి కలిపి.. సరూర్ నగర్ స్టేడియంకు పోటెత్తుదామని కార్యకర్తలకు, నిరుద్యోగులకు, అభిమానులకు, మానవతావాదులకు, ప్రజాస్వామ్య వాదులకు, నగర కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు. వరంగల్‌లో రైతులకు రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించగా, సరూర్ నగర్లో ప్రియాంక గాంధీ నిరుద్యోగ డిక్లరేషన్ ను ప్రకటించనున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు సైదులు నాయక్, వెంకటేశ్వర్లు, భారతి చంద్రం, తదితరులు పాల్గొన్నారు.