Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
నవ్వు నాలుగు విధాల చేటు.. ఇది గతం.. నవ్వు నలభై విధాల గ్రేటు... ఇది వాస్తవం... నవ్వటం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం... నవ్వలేకపోవడం ఒక రోగం... అన్న హాస్య రచయిత, దర్శకుడు జంధ్యాల మాటలను సార్ధకం చేస్తూ ఆదివారం స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో వంద నవ్వుల విందు'' కార్యక్రమం ఆద్యంతం హాస్యాన్ని పండించింది. ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ''స్టార్ మా'' లాఫ్టర్ ఫన్ విజేత మొగిలి గుణకర్ నేతృత్వంలో ''మొగిలి ఎంటర్టైన్మెంట్స్'' ఆధ్వర్యంలో నాన్ స్టాప్ నవ్వుల హంగామా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఆంద్రా, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన బుల్లితెర, సినీ రంగాల ప్రముఖ హాస్యనటులు చేసిన హాస్యం ప్రేక్షకులను నువ్వుల జల్లులల్లో ముంచెత్తాయి. జీ తెలుగు ''కామెడీ ఖిలాడీలు'' ఈటీవీ ప్లస్ గ్యాంగ్ లీడర్ ఫేమ్ డేవిడ్ రాజ్, కుమారి (బండోడు- గుండమ్మ) కామెడీ స్కిట్లు, ఈశ్వర్ బహదూర్, రమేష్ హాస్య వల్లరి, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ బాబా షరీఫ్ స్టాండ్ ఆఫ్ కామెడీ, నల్లగట్ల కిషోర్, వరుణ్ మిమిక్రీ నవ్వుల వాన కురిపించారు. ప్రత్యేక ఆకర్షణగా ఫైర్ రవి జగ్లింగ్ షో, జూనియర్ బాలయ్య, జూనియర్ రామ్ చరణ్ నిలిచారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వేల్పుల విజేత, మిత్ర గ్రూప్ చైర్మన్ కురవెల్ల ప్రవీణ్ మాట్లాడుతూ 23ఏండ్లుగా కమెడియన్గా రాణిస్తూ అందర్నీ నవ్విస్తున్న మొగిలి ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. డాక్టర్ నాగబత్తిని రవి మాట్లాడుతూ ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందంచే.. లాఫ్టర్ ఫన్ విజేతలుగా బహుమతి పొందిన మొగిలి గుణకర్ కమెడియన్గా, నటుడుగా సినిమాలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్, వేముల రవికుమార్, డాక్టర్ ముక్కపాటి కోటేశ్వరరావు, అన్నాబత్తుల సుబ్రహ్మణ్య కుమార్, ప్రముఖ న్యాయవాది జాబిశెట్టి పాపారావు, బండి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.